Begin typing your search above and press return to search.

లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి చిన్న వయస్కురాలు ఈమే!

దేశంలో పార్లమెంటు ఎన్నికలు ఏప్రిల్‌ నెల నుంచే జరగనున్నాయి. ఇప్పటికే తొలి దశ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   3 April 2024 10:30 AM GMT
లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి చిన్న వయస్కురాలు ఈమే!
X

దేశంలో పార్లమెంటు ఎన్నికలు ఏప్రిల్‌ నెల నుంచే జరగనున్నాయి. ఇప్పటికే తొలి దశ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆయా పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి.

కాగా లోక్‌ సభకు పోటీ చేసే దేశంలోనే అతి చిన్న వయసు వ్యక్తిగా శాంభవి చౌదరి రికార్డు సృష్టించారు. 25 ఏళ్ల శాంభవి చౌదరి బీహార్‌ లోని సమస్తిపూర్‌ లోక్‌ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. సమస్తిపూర్‌ ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఇటీవల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన లోక్‌ జనశక్తి పార్టీ నేత పశుపతి పరాస్‌ కుమారుడు ప్రిన్స్‌ గెలిచారు.

వచ్చే ఎన్నికల్లో లోక్‌ జనశక్తి పార్టీ (పాశ్వాన్‌) వర్గం నుంచి శాంభవి చౌదరి టికెట్‌ దక్కించుకున్నారు. లోక్‌ జనశక్తి పార్టీని కేంద్ర మాజీ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ నడుపుతున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూశాక పార్టీపై పెత్తనం కోసం ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్, సోదరుడు పశుపతి పరాస్‌ పోటీ పడ్డారు. గత ఎన్నికల్లో లోక్‌ జనశక్తి పార్టీ ఐదు ఎంపీ స్థానాలను గెలుపొందగా పశుపతి పరాగ్‌ వారందరినీ తనవైపుకు తిప్పుకున్నారు.

ప్రస్తుతం లోక్‌ జనశక్తి పార్టీ.. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో ఉంది. ఈ నేపథ్యంలో చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీకి బీజేపీ ఐదు స్థానాలను కేటాయించింది. ఇందులో ఒకటి సమస్తిపూర్‌.

ఈ నేపథ్యంలో ఉన్నత విద్యావంతురాలైన శాంభవి చౌదరిని లోక్‌ జనశక్తి పార్టీ తన అభ్యర్థిగా ఎంపిక చేసింది. దీంతో 25 ఏళ్ల శాంభవి చౌదరి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దేశంలోనే అతి పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పారు.

శాంభవి చౌదరి బీహార్‌కు చెందిన జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) పార్టీకి చెందిన అశోక్‌ చౌదరి కుమార్తె. ఈయన బీహార్‌ మంత్రివర్గంలో వివిధ ముఖ్యమైన పదవుల్లో పనిచేశారు.

కాగా శాంభవి సాయన్‌ కునాల్‌ ను వివాహం చేసుకుంది, ఈయన తండ్రి ఆచార్య కిషోర్‌ కునాల్‌ మాజీ ఐపీఎస్‌ అధికారి. బీహార్‌ అంతటా దేవాలయాలలో అనేక మంది దళిత పూజారులను నియమించడంలో కీలక పాత్ర పోషించారు.

కాగా శాంభవి చౌదరి తన పాఠశాల విద్యను పాట్నాలోని నోట్రే డామ్‌ అకాడమీ నుండి పూర్తి చేశారు. తదనంతరం ఆమె ఢిల్లీ యూనివర్సిటీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యను అభ్యసించారు. అలాగే ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుండి మాస్టర్స్‌ డిగ్రీని పొందారు.

ప్రస్తుతం ఆమె బీహార్‌ లోని మగద్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదువుతున్నారు. అలాగే జ్ఞాన్‌ నికేతన్‌ స్కూల్‌ గౌరవ డైరెక్టర్‌గా ఉన్నారు.

లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాంభవి చౌదరి మాట్లాడుతూ విద్య, ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి కృషి చేస్తానని వెల్లడించారు. సమస్తిపూర్‌ లో విద్య వైద్య రంగాలతోపాటు ఉద్యోగాల కల్పన, పెట్టుబడి అవకాశాలను పెంచడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడం వంటివి చేస్తానని హామీ ఇచ్చారు.