Begin typing your search above and press return to search.

శంషాబాద్ లో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది

సినిమాల్లో చూపించే టెర్రర్ సీన్ ఒకటి తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   10 March 2025 1:17 PM IST
శంషాబాద్ లో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది
X

సినిమాల్లో చూపించే టెర్రర్ సీన్ ఒకటి తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. పైలెట్ చాకచక్యంతో పాటు..చివరి నిమిషంలో అధికారుల అలెర్టుతో ఘోర విషాదం త్రుటిలో తప్పింది. విన్నంతనే ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఈ ఉదంతంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరకల్లేవు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ఆదివారం ఉదయం గోవా నుంచి ఇండిగో ఎయిర్ లైన్స్ 6ఈ-6973 విమాన సర్వీస్ 150 మంది ప్రయాణికులతో శంషాబాద్ మీదుగా వైజాగ్ బయలుదేరి వెళ్లాలి. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేయటానికి ఏటీసీ అధికారులు అనుమతించారు. పైలెట్ సైతం విమానం హైడ్రాలిక్ గేర్ ను సిద్ధం చేశారు.

విమాన సర్వీస్ ను డౌన్ చేసిన పైలట్ అప్పటికే రన్ వే మీద టేకాఫ్ తీసుకోవటానికి సిద్ధంగా ఉన్న మరో విమానాన్ని గుర్తించారు. ముంచుకొస్తున్న అపాయాన్ని గుర్తించిన పైలట్..క్షణంలో వెయ్యో వంతు అన్నంత వేగంగా అప్రమత్తమయ్యాడు. వెంటనే తన ఫ్లైట్ ను గాల్లోకి లేపాడు.

దీంతో.. పెను ప్రమాదం త్రుటిలో తప్పించి.. పది నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. ఆ తర్వాత మరోసారి గ్రౌండ్ క్లియరెన్సు తీసుకొని సేఫ్ గా ల్యాండ్ చేశాడు. అసలేం జరిగిందో అర్థం కాని ప్రయాణికులు కంగారు పడ్డారు. అయితే.. ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా దిగటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత షెడ్యూల్ లో భాగంగా శంషాబాద్ నుంచి వైజాగ్ కు బయలుదేరి వెళ్లింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో పైలట్ ను అభినందించాలి. అతగాడు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. పెను విషాదం చోటు చేసుకునేది.