ఒక రేంజ్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టు దూకుడు
శంషాబాద్ విమానాశ్రయం దూసుకెళుతోంది. ప్రయాణికుల రాకపోకల విషయంలో ఈ ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు భారీగా పెరుగుతున్నాయి.
By: Tupaki Desk | 17 Feb 2024 4:03 AM GMTశంషాబాద్ విమానాశ్రయం దూసుకెళుతోంది. ప్రయాణికుల రాకపోకల విషయంలో ఈ ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు భారీగా పెరుగుతున్నాయి. అందుకు నిదర్శనంగా తాజాగా విడుదల చేసిన గణాంకాలే నిదర్శనంగా చెప్పాలి. కేవలం 10 నెలల వ్యవధిలో ఏకంగా 2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎయిర్ పోర్టును జీఎంఆర్ గ్రూపు నిర్వాహణలో ఉన్న సంగతి తెలిసిందే.
ఇతర విమానాశ్రయాలతో పోలిస్తే శంషాబాద్ ఎయిర్ పోర్టు వ్రద్ధి ఎక్కువగా ఉందని చెప్పాలి. ఈ ఏడాది జనవరిలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 21.8 లక్షల మంది ప్రయాణాలు సాగించటం గమనార్హం. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్యలో 14 శాతం వ్రద్ధి రేటు కనిపించటం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి పది నెలల్లో హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 2.07 కోట్ల మందికి పైగా రాకపోకలు సాగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం.
జీఎంఆర్ గ్రూపు ఆధ్వర్యంలో హైదరాబాద్.. ఢిల్లీ ఎయిర్ పోర్టులతో పాటు గోవాలోని మోపా.. ఇండోనేషియాలోని మేడన్.. ఫిలిప్సీన్స్ లోని సెబు ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ఏడాది క్రితం మొదలైన మోపా ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరిలో ఒక్క నెలలో అత్యధిక విమానాలు వచ్చి వెళ్లిన పరిస్థితి. జనవరి 30న ఒక్క రోజుల్లో అత్యధికంగా 536విమానాలు వచ్చి వెళ్లాయి. ఒక్కరోజులో ఇంత భారీగా విమానాలు వచ్చి వెళ్లటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
హైదరాబాద్ నుంచి వివిధ జాతీయ.. అంతర్జాతీయ నగరాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కావటంతో పాటు ఇక్కడి సానుకూలతల వల్ల విమాన సర్వీసులు.. ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. హైదరాబాద్ నుంచి కొత్తగా ఫ్రాంక్ ఫర్డ్ కు విమాన సర్వీసును లుఫ్తాన్సా ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి అమెరికా.. కెనడా.. ఆస్ట్రేలియా.. యూకే లాంటి దేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో పాటు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువ కావటం కూడా ఎయిర్ రద్దీ పెరగటానికి కారణంగా మారిందని చెబుతున్నారు.