శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో ప్రాజెక్టు ఎల్ అండ్ టీకే!
అందులో ఒకటి ఎల్ అండ్ టీ. ఇప్పటికే హైదరాబాద్ మెట్రోను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎల్ అండ్ టీకే ఎయిర్ పోర్టు ప్రాజెక్టు ఇచ్చేందుకు ప్రభుత్వం మొగ్గు చూపింది.
By: Tupaki Desk | 10 Aug 2023 4:53 AM GMTశంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రోలో వెళ్లేందుకు వీలుగా చేపట్టిన ప్రాజెక్టు టెండర్ దిగ్గజ సంస్థ అయిన ఎల్ అండ్ టీకే దక్కింది. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును పీపీపీ పద్దతిలో నిర్వహిస్తున్న సంస్థకే తాజా ప్రాజెక్టు దక్కటం ఆసక్తికరంగా మారింది. ఎయిర్ పోర్టు మెట్రోకు సంబంధించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించగా.. రెండు సంస్థలు మాత్రమే ముందుకు వచ్చాయి. అందులో ఒకటి ఎల్ అండ్ టీ. ఇప్పటికే హైదరాబాద్ మెట్రోను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎల్ అండ్ టీకే ఎయిర్ పోర్టు ప్రాజెక్టు ఇచ్చేందుకు ప్రభుత్వం మొగ్గు చూపింది.
దాదాపు నెల రోజులుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు.. ఇంజినీరింగ్ ముఖ్యులు కలిసి.. పలు అంశాల్ని అధ్యయనం చేసి.. అనుభవం.. అర్హతల్లో ఎల్ అండ్ టీకే ప్రాధాన్యతను ఇస్తూ ఆ సంస్థకే టెండర్ ఖరారైనట్లుగా ఒక అధికారి వెల్లడించారు. అయితే.. అధికారికంగా మాత్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. త్వరలో ఈ అంశాన్ని ప్రభుత్వం వెల్లడిస్తుందని చెబుతున్నారు.
మెట్రో రెండో దశలో తొలి ప్రాధాన్యంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 31కి.మీ. ఎయిర్ పోర్టు మెట్రోనిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించటం తెలిసిందే. మొత్తం తొమ్మిది స్టేషన్లు ఉండనున్నాయి. టెండర్ వ్యయం రూ.5688 కోట్లు అయితే.. మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.6250 కోట్లుగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన పనులను ఇప్పటికే శంకుస్థాపన చేసిన వైనం తెలిసిందే.
హైదరాబాద్ మెట్రో మాదిరి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో కాకుండా మొత్తం ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించారు. అందుకే.. హైదరాబాద్ మెట్రోకు సంబంధం లేకుండా ఎయిర్ పోర్టు మెట్రో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయంచారు. కాకుంటే.. ఎయిర్ పోర్టు మెట్రో ప్రాజెక్టును పూర్తి చేయటానికి అవసరమైన పనుల్ని గుండు గుత్తుగా ఒకే సంస్థకు అప్పగించాలని భావించారు. మొదట్లో ప్యాకేజీల వారీగా పనులు చేపట్టాలని భావించినా.. అలా చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో.. మొత్తం ప్రాజెక్టును ఒకే సంస్థకు ఇవ్వాలని నిర్ణయించారు.
ఇప్పటికే హైదరాబాద్ మెట్రోను నిర్మించి.. నడిపిస్తున్న ఎల్ అండ్ టీకి ఉన్న అనుభవం.. ఆ సంస్థకు ఉన్న ప్రత్యేకతల కారణంగా.. ఎయిర్ పోర్టు ప్రాజెక్టును సైతం అదే సంస్థకు అప్పజెప్పటం ద్వారా.. అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి అవుతుందని భావిస్తున్నారు. మెట్రోప్రాజెక్టుల్లో ఈపీసీ టెండర్ పిలవటం ఇదే తొలిసారి. సివిల్ వర్కుతో పాటు సిగ్నలింగ్.. ఎలక్ట్రికల్.. రోలింగ్ స్టాక్.. స్టేషన్ ప్లానింగ్.. ట్రాక్ పనులతో పాటు.. డిపోలు.. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్.. విద్యుత్ స్కోడా వ్యవస్థ ఇలా ప్రతి ఒక్క పనిని ఎల్ అండ్ టీనే చూసుకోనుంది.
ఎయిర్ పోర్టు మెట్రో ప్రాజెక్టు మొత్తం ప్రభుత్వానిదే కావటంతో.. ఎల్ అండ్ టీ సంస్థకు నిధుల సమస్యా.. నష్టాలు వచ్చే భారం ఉండదు. దీనికి తోడు హైదరాబాద్ మెట్రోను ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా నిర్వహిస్తున్న అనుభవం కూడా ఎయిర్ పోర్టు మెట్రో ప్రాజెక్టుకు కలిసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెప్టెంబరు నుంచి ప్రాజెక్టు పనుల్ని ఎల్ అండ్ టీ చేపట్టే వీలుందన్న మాట వినిపిస్తోంది.