సొంతిల్లుకు మిన్న అద్దె ఇల్లు.. అదెలానో చెప్పిన ఆ సీఈవో
సంపదను క్రియేట్ చేసే విషయంలో ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. అందులో ఏది అత్యుత్తమం అంటూ ఏమీ ఉండదు.
By: Tupaki Desk | 2 May 2024 6:41 AM GMTసంపదను క్రియేట్ చేసే విషయంలో ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. అందులో ఏది అత్యుత్తమం అంటూ ఏమీ ఉండదు. కొన్ని ప్రాంతాల్లో వర్తించే కొన్ని లాజిక్కులు అన్ని ప్రాంతాలకు అదే సూత్రాన్ని అనుసరిస్తానంటే అడ్డంగా బుక్ కావటం ఖాయం. అదే టైంలో ఎవరికి వారు.. వారి మైండ్ సెట్ కు అనుగుణంగా ఆర్థిక అంశాల విషయాల్లో నిర్ణయం తీసుకుంటారు. కోట్లాది మంది కలలు కనే సొంతిల్లు విషయంలో కొందరు భిన్నంగా స్పందిస్తుంటారు.
సొంతిల్లు కొనటానికి మించిన అర్థం లేని పని మరొకటి ఉండదంటూ స్ట్రాంగ్ గా వాదన వినిపించేటోళ్లు లేకపోలేదు. దీనికి వారు చెప్పే ఆర్థిక సూత్రాలు బాగానే ఉన్నట్లు అనిపించినా.. ప్రాక్టికల్ గా ఎంతమేర వర్కువుట్ అవుతుందన్నది ప్రశ్న. అదే సమయంలో ఈ టైంలో వారు వినిపించే వాదన.. భవిష్యత్తులోనూ స్థిరంగా ఉంటుందన్న నమ్మకం ఉండదు. ఇంతకూ విషయం ఏమంటే.. సొంతిల్లు కంటే అద్దె ఇంటికి మించిన సౌకర్యం ఎంతో ఉంటుందని చెబుతున్నారు బాంబే షేవింగ్ వ్యవస్థాపకుడు.. సదరు కంపెనీ సీఈవో శంతను ఆసక్తికర వాదనను తన పాడ్ క్యాస్ట్ లో వినిపించారు.
సొంతింటి కంటే అద్దె ఇల్లే ఉత్తమం అని చెప్పే ఆయన.. తన అనుభవాన్ని వెల్లడించారు. తాను గురుగ్రామ్ లోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆ ఇంటి కోసం నెలకు రూ.1.5లక్షల అద్దెను చెల్లించి ఉన్నట్లుగా పేర్కొన్నారు. తాను ఉంటున్న అపార్టుమెంట్ విలువ రూ.7.5 కోట్ల వరకు ఉంటుందని.. తాను కానీ ఆ ఇంటిని సొంతం చేసుకోవాలంటే తాను 70 శాతం లోన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
అలాంటి వేళలో ప్రతి నెలా ఈఎంఐల కోసం నెలకు రూ.ఆరేడు లక్షలు కట్టాల్సి ఉంటుందని.. ఆ లెక్కన చూసినప్పుడు తాను ఈఎంఐలో కట్టే దానిలో కేవలం పావు శాతాన్ని కట్టేస్తే కోరుకున్న ఇంట్లో ఉండొచ్చన్నది ఆయన వాదన. అద్దెో ఇంట్లో ఉండటం వల్ల ఆపీసుకు దగ్గరగా ఉండొచ్చని చెప్పారు. ఆఫీసుకు దగ్గరగా ఉండాలన్నఉద్దేశంతో తాను చాలాసార్లు ఇంటి మార్చినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సొంతిల్లు వర్సెస్ అద్దె ఇల్లు అంశం మీద సోషల్ మీడియాలో ఎవరికి వారు వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. శంతను అభిప్రాయాన్ని కొందరు ఏకీభవిస్తుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అద్దె ఇల్లు బెటర్ అన్న శంతను.. హైదరాబాద్ లో ఇంటి అద్దెలు భిన్నంగా ఉండొచ్చన్న వ్యాఖ్య చేశారు. సొంతింట్లో ఉండే సౌకర్యం వేరుగా ఉంటదని.. అద్దె ఇంట్లో పరిమితులు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.కొందరు తమ యజమానుల తీరును ప్రస్తావిస్తూ అభిప్రాయాల్ని షేర్ చేస్తున్నారు.