Begin typing your search above and press return to search.

ఆర్ఎస్ఎస్ కు శరద్ పవార్ పొగడ్తలు.. పాలిటిక్స్ లో ఏమైనా జరగొచ్చు

అలాంటి పవార్ పార్టీ రెండేళ్ల కిందట నిలువుగా చీలిపోయింది.

By:  Tupaki Desk   |   11 Jan 2025 4:30 PM GMT
ఆర్ఎస్ఎస్ కు శరద్ పవార్ పొగడ్తలు.. పాలిటిక్స్ లో ఏమైనా జరగొచ్చు
X

ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలోనే కాంగ్రెస్ లో కాకలు తీరి.. సోనియా గాంధీని ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టుకుని.. ఎన్నికల్లో ప్రభావం చూపించి.. మళ్లీ కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకున్న ఘనత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ది. అలాంటి పవార్ పార్టీ రెండేళ్ల కిందట నిలువుగా చీలిపోయింది. అన్న కొడుకు అజిత్ పవార్ మెజారిటీ ఎమ్మెల్యేలతో వెళ్లిపోయారు. బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో చేరారు. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్సీపీ (శరద్ పవార్) ఘోరంగా ఓడింది. ఈ ఫలితాల అనంతరం తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో శరద్ పవార్ మనసు విప్పారు. తాను జీవిత కాలం దూరంగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను కొనియాడారు. ఆర్ఎస్ఎస్ మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయానికి బాగా పాటుపడింది. దీనిని ఉదహరిస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నిబద్ధతను చూసి నేర్చుకోవాలని తమ పార్టీ శ్రేణులకు శరద్ పవార్ సూచించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు.

వాస్తవానికి గత ఏడాది వేసవిలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ-శివసేన (శిందే)-ఎన్సీపీ (అజిత్ పవార్) కూటమి మహాయుతికి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఈ కూటమి 17 సీట్లు మాత్రమే నెగ్గింది. కాంగ్రెస్-ఎన్సీపీ (శరద్ పవార్)-శివసేన (ఉద్ధవ్) సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ 30 సీట్లలో గెలిచింది. మరొక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. 288 స్థానాలకు 230 చోట్ల నెగ్గింది. దీనికి కారణంగా లోక్‌ సభ ఎన్నికల్లో మహా వికాస్‌ అఘాడీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ఆరెస్సెస్‌ విచార్‌ పరివార్‌ సమర్థంగా తిప్పికొట్టడమేనని అంటున్నారు సీఎం ఫడణవీస్.

శరద్ పవార్ వ్యాఖ్యలను ఉద్దేశించి.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చన్నారు. అరాచక శక్తులకు వ్యతిరేకంగా జాతీయ శక్తులన్నీ ఏకతాటిపై పనిచేయాల్సి ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ విచార్‌ పరివార్‌ ను కోరగా.. పూర్తి సహకారం అందించారని.. తాము నకిలీ ప్రచారాన్ని అడ్డుకున్నామని ఫడణవీస్ తెలిపారు. దీంతో లోక్‌ సభకు భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయని చెప్పారు.

లోక్‌ సభ ఎన్నికల్లో అతి విశ్వాసంతో ముందుకెళ్లామని.. ప్రత్యర్థులు తాము రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ దుష్ప్రచారం చేయడం ప్రభావం చూపిందని తెలిపారు.

శరద్ పవార్ సాహెబ్ చాలా స్మార్ట్‌ అని.. కొన్నిసార్లు పోటీదారులను ప్రశంసించాల్సి ఉంటుందని.. అందుకే ఆయన ఆర్ఎస్ఎస్ ను పొడిగి ఉంటారని ఫడణవీస్ అన్నారు.

వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ను శరద్ పవార్ పొగడడంతో చాలామందికి అనుమానాలు వచ్చాయి. ఆయన బీజేపీ వైపు మొగ్గుతున్నారా? అజిత్ పవార్ ను క్షమించి మళ్లీ కలుపుకొంటారా? అనే అభిప్రాయాలు వినిపించాయి. ఇప్పుడు ఫడణవీస్ స్పందన చూస్తే మరో విధమైన ఉద్దేశం కనిపిస్తోంది.