శరద్ పవార్ కి రిటైర్మెంట్ ఇచ్చేశారా ?
శరద్ పవార్ ది దాదాపుగా ఏడు దశాబ్దాల రాజకీయ జీవితం.
By: Tupaki Desk | 24 Nov 2024 4:35 AM GMTఆయనను మరాఠా దిగ్గజం అని పిలుస్తారు. ఆయన రాజకీయ ఎత్తుగడకు ప్రత్యర్ధులకు అందనంత ఎత్తులో ఊహకు సైతం తెలియనంత లోతులో ఉంటాయి. శరద్ పవార్ ది దాదాపుగా ఏడు దశాబ్దాల రాజకీయ జీవితం.1958లో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రాధాన్యత ఇచ్చి యూత్ కాంగ్రెస్ నాయకుడు అయ్యారు.
ఆ తరువాత 1962లో పూనా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 1967లో 27 సంవత్సరాల వయసులో మహారాష్ట్ర శాసనసభకు బారామతి నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత మంత్రి పదవులు చేపట్టి 1978లో ఏకంగా సీఎం గా అయ్యారు.
ఇందిరాగాంధీకి ఒకనాడు అత్యంత సన్నిహితుడుగా పేరున్న శరద్ పవార్ రాజీవ్ గాంధీతోనూ సాన్నిహిత్యం నెరిపి మరోమారు సీఎం అయ్యారు. అలా ఆయన ముఖ్యమంత్రిగా అనేక సార్లు చేశారు. కేంద్రంలో మంత్రిగానూ చేశారు.
దాదాపుగా 66 ఏళ్ళ రాజకీయ జీవితం ఆయన సొంతం 1999లో సోనియాగాంధీ విదేశీ మూలాలను ప్రశ్నించి ఆ పార్టీ నుంచి వేరు పడ్డారు. ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి పాతికేళ్ళుగా ఒంటి చేత్తో నడుపుకుని వస్తున్నారు
ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కనీసం ముప్పయ్ నుంచి నలభై సీట్లకు తగ్గకుండా గెలుస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించే ఎన్సీపీకి 2024 ఎన్నికల్లో 10 సీట్లు మాత్రమే దక్కాయి. అంటే శరద్ పవార్ పవర్ పూర్తిగా లేకుండా పోయింది అని అంటున్నారు.
తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ దెబ్బ తీశారని ఆగ్రహించిన పవార్ ఈ ఏడాది మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జనంలోకి వెళ్ళి గట్టిగానే ప్రచారం చేశారు. ఆయన పార్టీకి 8 ఎంపీ సీట్లు ప్రజలు ఇచ్చారు. అజిత్ పవార్ పార్టీని తిప్పికొట్టారు
దాంతో అదే సీను అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ అవుతుందని భావించిన పెద్దాయనకు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారు. 2026తో రాజ్యసభ సభ్యత్వం ముగుస్తోంది. శరద్ పవార్ తాను గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈసారి తన పార్టీని గెలిపించాలని అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజలను అభ్యర్ధించారు.
కానీ జనాలు మాత్రం బాబాయ్ వద్దు అనేశారు. అబ్బాయి అజిత్ పవార్ పార్టీ అసలైన ఎన్సీపీ అని తేల్చేసి 41 సీట్లు ఇచ్చేశారు దాంతో ఎన్నికల ఫలితాల ద్వారా బాబాయ్ ని పొలిటికల్ గా రిటైర్ అయిపోవచ్చు అని చెప్పేశారు అన్న మాట. ఇపుడు ఎనభై నాలుగేళ్ల వయసులో ఉన్న శరద్ పవార్ లోని పొలిటికల్ పవర్ తగ్గింది అని లేటెస్ట్ రిజల్ట్స్ నిరూపించాయి. ఆయన కుమార్తె సుప్రియా సూలేకు తండ్రి లా పార్టీని నడిపే సత్తా అయితే లేదు అని అంటున్నారు.
దాంతో రానున్న రోజులలో ఎన్సీపీ నేతగా శరద్ పవార్ కి అసలైన వారసుడిగా అజిత్ పవార్ ఉండబోతున్నారు అని అంటున్నారు. ఇక శరద్ పవార్ పార్టీ తరఫున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో ఉంటారా లేక అజిత్ వైపు వస్తారా అంటే దానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని అంటున్నారు. కేవలం 18 ఏళ్ళ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన శరద్ పవార్ ఎనిమిది పదుల వయసులో ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేసింది అని అంటున్నారు. మహా ఫలితాలు అలా డిసైడ్ చేశాయని అంటున్నారు. అదన్న మాట బాబాయ్ పొలిటికల్ ఫ్యూచర్.