అయితే అన్న.. లేకుంటే బాబు.. ఇదేం రాజకీయం షర్మిలక్కా ..!
నిజానికి సొంతగా పార్టీని నడిపించేందుకు ఆమెకు పగ్గాలు ఇస్తే.. ఆ పని మానేసి వ్యక్తిగత అజెండాతో ముందుకు సాగుతు న్నారు.
By: Tupaki Desk | 8 March 2025 9:00 PM ISTకాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల.. నోటికొచ్చింది మాట్లాడేయడం.. చేతికి వచ్చింది రాసేయడం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. అయితే.. అన్న.. లేకపోతే బాబు.. ఇదే రాజకీయం అంటూ ఎద్దేవా చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అన్నపై విరుచుకు పడి.. సొంత పార్టీ ప్రయోజనాలను కూడా తుంగలోతొక్కారన్న విమర్శలు ఉన్నాయి. నిజానికి సొంతగా పార్టీని నడిపించేందుకు ఆమెకు పగ్గాలు ఇస్తే.. ఆ పని మానేసి వ్యక్తిగత అజెండాతో ముందుకు సాగుతు న్నారు.
ఇప్పుడు కూటమి సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పుకాదు. కానీ, వాస్తవాలు.. విషయాలు తెలుసుకుని చేసే విమర్శలకు వాల్యూ ఉంటుంది. లేకపోతే.. రాజకీయాల్లో కలుపు మొక్కలుగా మిగిలిపోతారన్న వాదన ఉండనే ఉంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాలపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేసిన ప్రకటనపై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ.. షర్మిల చేసిన ట్వీట్ విమర్శలకు దారి తీసింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణల్లో ఆర్టీసీ బస్సు.. ప్రయాణాలు ఉచితంగానే అందిస్తున్నారు. అయితే.. అవి ఎంత సక్సెస్ అవుతున్నాయో.. అందరికీ తెలిసిందే. నిరంతరం.. మంత్రులే మహిళలపై సూటిపోటి విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు.. ఉచిత ప్రయాణాలు ఎత్తేస్తామని.. అవసరం లేదని.. మహిళలకు ఇవి పనిలేకుండా చేశాయని.. ఇలా తీవ్ర విమర్శలు చేస్తున్న కర్ణాటక మంత్రుల సంగతిని షర్మిల గుర్తుంచుకోవాలి.
ఇక, తెలంగాణలో అయితే.. మహిళలు పెరుగుతున్నారని గ్రహించిన ప్రభుత్వం ఆర్టీసీ సర్వీసులను తగ్గించేస్తున్న విషయం షర్మిలకు తెలియదా? ఈ సమస్యలను గుర్తించే.. ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు రాకుండా.. ప్రభుత్వానికి ఇది ఇబ్బంది కలిగించకుండా.. మధ్యేమార్గంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకునేం దుకు జిల్లాల స్థాయిలో ఉచిత ప్రయాణాలను పరిమితం చేయడం తప్పెలా అవుతుంది? దీనిని అర్ధం చేసుకోకుండా.. అయితే అన్న.. లేకపోతే బాబు అన్న చందంగా రాజకీయాలు చేయడం షర్మిలకే చెల్లిందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.