కుదిరితే వైసీపీ...లేకపోతే బీజేపీ !
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాజకీయం బాగానే ఉంది అని సెటైర్లు పడుతున్నాయి.
By: Tupaki Desk | 4 Sep 2024 6:20 PM GMTఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాజకీయం బాగానే ఉంది అని సెటైర్లు పడుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆమె తమలపాకుతో కొట్టినట్లుగా రెండు ముక్కలు మాత్రమే విమర్శలు చేస్తారు. ఆ మీదట గత ప్రభుత్వం అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం బాగానే తూర్పారా పడతారు.
భారీ వరదలు వచ్చింది ప్రస్తుతం. దీనికి కారణాలు ఏమిటో అందరికీ తెలుసు. ఆక్రమణల వల్లనే బుడమేరు పొంగి నివాసాల్లోకి వచ్చింది. ఆ పాపంలో ఉమ్మడి ఏపీని పాలించిన నాటి కాంగ్రెస్ నుంచి టీడీపీ వైసీపీ అందరి పాత్ర ఉంది. అంతే కాదు భారీగా వరదలు వస్తాయని ఊహించక పోవడం కూడా ఎంతో కొంత ప్రభుత్వ వైఫల్యం కిందకే వస్తుందని అంటున్నారు.
అయితే షర్మిల మాత్రం టీడీపీ కూటమిని వదిలేసి జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడాన్ని వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. గత ప్రభుత్వం అయిదేళ్లలో నీటి ప్రాజెక్టులకు కనీసం ఇయర్లీ మెయింటేనెన్స్ కి కూడా నిధులు ఇవ్వలేదు అని షర్మిల విమర్శించారు. దాని ఫలితంగా నదులలో గేట్లు తేలియాడటం అంతా చూసారు అని ఆమె అన్నమయ్య ప్రాజెక్టు గేట్ విరిగిపడిన ఉదంతాన్ని గుర్తు చేశారు. ఆ మీదట ఆమె కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీద పడ్డారు. ఏపీలోని పార్టీల మద్దతుతో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏపీకి ఏమి సాయం చేస్తోంది అని నిలదీశారు. ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
ఇక ఏపీలో ప్రకాశం బ్యాజేజి ఢీ కొన్న పడవల ప్రమాదం మీద విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దీని వెనక ఏ శక్తులు ఉన్నాయో వెలికి తీయాలని అన్నారు. వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. చరిత్ర కలిగిన ప్రకాశం బ్యారేజ్ కే ఈ రకమైన పరిస్థితి వస్తే ఎలా అని ఆమె అన్నారు.
మరి పడవలు ప్రకాశం బ్యారేజిని ఢీ కొట్టడం వెనక కుట్ర కోణం ఉందని టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే చెబుతోంది. ఇపుడు షర్మిల కూడా దాని మీదనే డిమాండ్ చేస్తున్నారు. మరి ఇండైరెక్ట్ గా ఆమె చేసిన ఈ కామెంట్స్ కూడా ఎవరి మీద అన్న చర్చ వస్తోంది.
మొత్తం మీద చూస్తే షర్మిల వైసీపీనే టార్గెట్ చేశారు అని అంటున్నారు. అంతే కాదు కేంద్రంలో బీజేపీ ఎటూ కాంగ్రెస్ కి శత్రువే కాబట్టి ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఓకే. కానీ ఏపీలో టీడీపీ కూటమిలో కూడా బీజేపీ ఉందని ఆమెకు తెలియదా అని అంటున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మీద కంటే కూడా వైసీపీ మీదనే ఆమె చేస్తున్న పోరాటం రాజకీయ విమర్శలు అన్నీ కూడా చర్చకు కారణం అవుతున్నాయి.