షర్మిల బాణాలు గురితప్పుతున్నాయా ..!
నిన్న మొన్నటి వరకు అన్న జగన్‌ను టార్గెట్ చేసుకుని నిప్పులు చెరిగిన షర్మిల.. అనూహ్యంగా తన బాణాలను సీఎం చంద్రబాబువైపు మళ్లించారు.
By: Tupaki Desk | 9 Dec 2024 12:30 AM GMTఎంత వరకు ఏ పాత్ర పోషించాలో.. అంత వరకు పోషిస్తే... రక్తికడుతుంది... రంజుగా ఉంటుంది... రాణి స్తుంది కూడా! మోతాదు మించితే మాత్రం వెగటు పుడుతుంది.. వెక్కిరింత కూడా అవుతుంది. ఈ విష యం రాజకీయాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అంతర్మథనం చేసుకోవాలి. ఈ రెండు చేయకపోతే.. ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ . షర్మిల కూడా.. ఇదే దారిలో పయనిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
నిన్న మొన్నటి వరకు అన్న జగన్‌ను టార్గెట్ చేసుకుని నిప్పులు చెరిగిన షర్మిల.. అనూహ్యంగా తన బాణాలను సీఎం చంద్రబాబువైపు మళ్లించారు. చంద్రబాబు కూడా.. అమ్ముడు పోయారా? అంటూ.. వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ వ్యవహారంలో తన సోదరుడు లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఆమె కొన్నాళ్లుగా విజృంభిస్తున్న షర్మిల.. దీనిపై విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఏసీబీకి కూడా ఫిర్యాదులు చేశారు.
కానీ, ఎవరూ పట్టించుకోలేదు. పైగా సొంత పార్టీలోనూ ఎవరూ షర్మిలకు ఇప్పుడు కూడా అండగా నిలిచింది లేదు. నిజానికి ఇతర విషయాల మాట ఎలా ఉన్నా.. అదాని వ్యవహారాన్ని జాతీయ కాంగ్రెస్ కూడా తీవ్రంగా చూస్తోంది. పార్లమెంటు ఉభయ సభలను కూడా స్తంభింప చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏపీలో ఇదే విషయంపై పోరాడుతున్న షర్మిలకు రాష్ట్ర నాయకులు అండగా ఉంటారని అనుకున్నారు. కానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా షర్మిల వ్యాఖ్యలను బలపరిచేలా వ్యవహరించక పోవడం గమనార్హం.
ఈ క్రమంలోనే ఏసీబీ ఫిర్యాదును తీసుకున్నా.. ఆమెకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అన్నను జైలుకు పంపించాలన్న వ్యూహం తొలి అడుగులోనే బెడిసి కొట్టడంతో ఆమె వ్యూహం తప్పిపోయారు. నేరుగా చద్రబాబును టార్గెట్ చేశారు. ఇదిమరో ప్రధాన తప్పిదమేనని అంటున్నారు పరిశీలకులు. సీఎంను తిట్టిపోసినంత మాత్రాన ఒత్తిడి చేసినంత మాత్రాన.. షర్మిల బాణాలు సూటిగా తగిలే అవకాశం లేదని.. ఆమెకు రాజకీయంగా ఇంకా కొంత కాలం నిరీక్షణ తప్పదని చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే.. అటు పార్టీలోను, ఇటు ప్రజల్లోనూ షర్మిల బాణాలు గురి తప్పుతున్నాయనే అంటున్నారు.