Begin typing your search above and press return to search.

బాబు జగన్ దొందుకు దొందేనట !

ఏపీలో ఇద్దరు నాయకులు రెండు పార్టీలు. అధికారం అటు నుంచి ఇటు తిరుగుతూ వారి వద్దకే చేరుతోంది.

By:  Tupaki Desk   |   19 Nov 2024 3:29 AM GMT
బాబు జగన్ దొందుకు దొందేనట !
X

ఏపీలో ఇద్దరు నాయకులు రెండు పార్టీలు. అధికారం అటు నుంచి ఇటు తిరుగుతూ వారి వద్దకే చేరుతోంది. ఈ నేపథ్యంలో మూడవ పార్టీగా ఎవరైనా వచ్చినా ఈ రెండు పార్టీల వైపే చూడాల్సి వస్తోంది. దాంతో ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. గత మూడు సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు చంద్రబాబు సీఎం ఒకసారి జగన్ సీఎం అయ్యారు. విభజన తరువాత పదేళ్ల ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల ఏలుబడి గురించే చర్చించాల్సి వస్తుంది.

ఇక చూస్తే నిన్నటి వరకూ చూడూ ఒక వైపే చూడూ అన్న విధానం పాటిస్తూ వైసీపీని నిందించిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇపుడు రెండవ వైపు చూస్తున్నారు. ఆమె టీడీపీ కూటమి పాలనను విమర్శిస్తూనే అయిదేళ్ళ జగన్ పాలనను కూడా ప్రస్తావిస్తున్నారు. జగన్ సీఎం గా ఏమీ చేయలేదు అంటూ వైసీపీకి ఇవ్వాల్సిన కోటా ఇచ్చేస్తున్నారు.

తాజాగా శాసనమండలిలో వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య ఏపీలో శాంతి భద్రతలు మహిళల అఘాయిత్యాల మీద చర్చ సాగింది. రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. సరిగ్గా ఈ పాయింట్ ని పట్టుకున్న షర్మిల ఏపీలో గత పదేళ్ళలో దారుణంగా మహిళల మీద నేరాలు పెరిగాయని అన్నారు. చట్ట సభలలో చర్చ చూస్తే అది అర్ధం అవుతోంది అన్నారు.

మహిళలకు రక్షణ కల్పిస్తామని గద్దెనెక్కిన టీడీపీ వైసీపీ ప్రభుత్వాంలూ రెండూ ఏమీ చేయలేదని షర్మిల ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. మహిళలకు ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు చేసింది ఏమీ లేకపోగా మహిళల మాన ప్రాణాల మీద రాజకీయాలు మాత్రం చేస్తున్నారు అని దుయ్యబెట్టారు.

ఏపీలో అసలు మహిళలకు భద్రత ఎక్కడ ఉందని ఆమె నిలదీశారు. శాసన మండలిలో జరిగిన చర్చను చూస్తే కనుక ఏపీలో 2014-19 మధ్య రాష్ట్రంలో 83,202 కేసులు నమోదయ్యాయట. 2019-24 మధ్య నమోదైనవి 1,00,508 కేసులట అని ఆమె రెండు పార్టీలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు

టీడీపీ కంటే వైసీపీ పాలనలో ఎక్కువ కేసులు ఉన్నాయని వారు చెబుతూంటే కూటమి ప్రభుత్వం వచ్చాక సగటున రోజుకు 59 అత్యాచారం కేసులు నమోదు అవుతున్నాయని వైసీపీ అంటోందని ఆమె ఈ చర్చను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిని బట్టి పదేళ్ళలో ఏపీలో మహిళలమీద లక్షలలో కేసులు నమోదు అయ్యాయని చెప్పకనే చెబుతున్నారని ఆమె సెటైర్లు వేశారు.

ఇలా గత పదేళ్లలో దాదాపు రెండు లక్షల కేసులు నమోదయ్యాయంటే, మహిళలకు భద్రత కల్పించడంలో ఏపీ ఎక్కడుందో అర్థమవుతోందని ఆమె విమర్శించారు. ఈ విధంగా పెచ్చరిల్లుతున్న నేరాలను అరికట్టలేని స్థితిలో ఉన్న వైసీపీ, టీడీపీ రెండూ సిగ్గుతో తలదించుకోవాలని సోషల్ మీడియా వేదికగా షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో దిశ ఎక్కడ ఉంది, అలాగే నిర్భయ చట్టం పేరుకు మాత్రమే ఉందని అన్నారు. ఏపీలో మహిళలపై అఘాయిత్యాలకు ఎవరైనా పాల్పడితే నిర్భయ చట్టం కింద 40 రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారని, ఇక దిశ చట్టం కింద 20 రోజుల్లోనే చర్యలు తీసుకుంటామని జగన్ మహిళల చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టారని ఆమె విమర్శించారు.

ఏపీలో పదునైన చట్టాలను మాత్రం అమలు చేయలేదని ఆమె అన్నారు. గత పదేళ్లలో ఒక్క నేరస్తుడికైనా కఠిన శిక్ష పడిందా అని ఆమె రెండు పార్టీలను నిలదీశారు. ఏపీ అభివృద్ధిలో చివరి స్థానంలో ఉంటే డ్రగ్స్ వాడకంలో, మహిళలపై అఘాయిత్యాలలో ప్రథమ స్థానం ఉందని షర్మిల విమర్శలు చేశారు. ఆమె జగన్ ని చంద్రబాబుని ఒక గాటకు కట్టేసి కొత్త రాజకీయాన్ని స్టార్ట్ చేశారు అని అంటున్నారు.