Begin typing your search above and press return to search.

11 మందితో వచ్చి 11 నిమిషాలు... మళ్ళీ తగులుకున్న షర్మిల!

కూటమిని మించి ఆమె వైసీపీపై విమర్శలు చేస్తున్నారు! ఈ నేపథ్యంలో.. జగన్ అండ్ కో ఈ రోజు అసెంబ్లీకి వచ్చిన విషయంపై షర్మిల తనదైన శైలిలో స్పందించారు.

By:  Tupaki Desk   |   24 Feb 2025 1:35 PM GMT
11 మందితో వచ్చి 11 నిమిషాలు... మళ్ళీ తగులుకున్న షర్మిల!
X

ఏపీలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచీ వైసీపీ అధినేత జగన్ పై రాజకీయ పోరాటంతో పాటు వ్యక్తిగత విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కూటమిని మించి ఆమె వైసీపీపై విమర్శలు చేస్తున్నారు! ఈ నేపథ్యంలో.. జగన్ అండ్ కో ఈ రోజు అసెంబ్లీకి వచ్చిన విషయంపై షర్మిల తనదైన శైలిలో స్పందించారు.

అవును... ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్.. తనతో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని వచ్చారు. ఈ సందర్భంగా... తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సభలో నినాదాలు చేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి, బయటకు వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా స్పందించిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల... జనాలు ఛీ కొడుతున్నా వైసీపీ అధ్యక్షులు జగన్ తీరు మాత్రం మారలేదని మొదలు పెట్టారు. అనంతరం.. "11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది..? ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా..? సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా..?"

"కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా..?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా... ప్రజల శ్రేయస్సు కంటే.. మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారని షర్మిల మండిపడ్డారు. ప్రజాసమస్యల మీద చిత్తశుద్ది ఉంటే .. మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్ళాలని కోరుతున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే... సభకు వెళ్ళే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని షర్మిల మరోసారి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

అంతకంటే ముందు... గవర్నర్ ప్రసంగంపై షర్మిల విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా... గవర్నర్ ప్రసంగంలో పసలేదని.. దిశా-నిర్దేశం అంతకన్నా లేదని.. అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలని షర్మిల విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదని ఆమె అన్నారు.

పదే పదే సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదని.. ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్ప మిగతా 5 హామీలపై స్పష్టత లేదని.. మనుషులు, వనరులు, చేపలు అంటూ సామెతలు చెప్పారు తప్పిస్తే.. బాబు విజన్ 2047కి దమ్ము లేదని.. 8 నెలల పాలన కాలయాపన తప్పా ఎక్కడా కమిటిమెంట్ కనిపించలేదని షర్మిల నిప్పులు చెరిగారు.

ఇదే సమయంలో.. హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందని చెప్పిన షర్మిల... అసలు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఎక్కడొచ్చాయి..? 4 లక్షల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎవరికిచ్చారు..? తొలి సంతకం పెట్టిన డీఎస్సీకి అసలు నోటిఫికేషన్ అయినా ఇచ్చారా..? ఆరోగ్య శ్రీ బకాయిలు ఎప్పుడు చెల్లించారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా... కొత్త సీసాలో పాత సారా అనే సామెత లెక్క కూటమి మ్యానిఫెస్టోనే గవర్నర్ చదివారు తప్పిస్తే.. కొత్త అంశాలు ఒక్కటి లేవని షర్మిల విరుచుకుపడ్డారు!