షర్మిల చేతిలో కాంగ్రెస్ ముందుకా వెనక్కా ?
పీసీసీ చీఫ్ గా షర్మిలను చేయడం ద్వారా పోయిన చోట నుంచే ఓట్లను దక్కించుకోవడం అన్నది వారి ఆలోచన.
By: Tupaki Desk | 11 Dec 2024 3:32 AM GMTఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టి పది నెలలు అవుతోంది. అయితే కాంగ్రెస్ ఈ పది నెలలలో ఏపీలో బాగుపడిందా ఏమైనా పుంజుకుందా అన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా ఒడ్డున పడేయడానికి కాంగ్రెస్ పెద్దలు ఎంచుకున్న ఒక మార్గం షర్మిల చేతిలో కాంగ్రెస్ పగ్గాలు పెట్టడం.
పీసీసీ చీఫ్ గా షర్మిలను చేయడం ద్వారా పోయిన చోట నుంచే ఓట్లను దక్కించుకోవడం అన్నది వారి ఆలోచన. ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంటా వైసీపీ ఉఫ్ అంటూ ఊదేసింది. దాంతో వైసీపీని వీక్ చేస్తూ కాంగ్రెస్ ని బలోపేతం చేయడం అన్నది ఒక బిగ్ టాస్క్.
దానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కన్నుమూసిన వైఎస్సార్ బ్లడ్ అయిన షర్మిల అయితే బెటర్ గా ఉంటుందని ఆలోచించి మరీ పగ్గాలు అందించారు. అయితే షర్మిల సాధారణ ఎన్నికల్లో పెద్దగా కాంగ్రెస్ బండిని ముందుకు తీసుకుని వెళ్లలేకపోయారు. వైసీపీ వద్దనుకున్న వారు అంతా టీడీపీలోకే చేరిపోయారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వంటి వారి వద్దకు షర్మిల వెళ్ళినా ఫలితం లేకపోయింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారితో భేటీలు వేసినా ఏమీ జరగలేదు.
అయితే ఉన్నంతలో వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆమంచి క్రిష్ణ మోహన్ వంటి వారిని కాంగ్రెస్ లో తీసుకుని వారిని పోటీకి పెట్టారు. ఇక చిన్నా చితకా నేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు. అయితే ఎంత చేసినా కాంగ్రెస్ ఏపీలో తన ఓటు షేర్ ని పెంచుకోలేకపోయింది.
స్వయంగా షర్మిల కడప ఎంపీ సీటుకు పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆమెకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆమె కొంగు చాటి ఓట్లు అడిగిన ఆమెను సొంత జిల్లా జనాలు కరుణించలేదు. మరో వైపు ఎన్నికల్లో షర్మిల ఎంచుకున్న అజెండా అయితే పెద్దగా ప్రజలకు కనెక్ట్ అవలేదు అని అంటున్నారు.
తన అన్న మీద విమర్శలు చేయడం బాబాయ్ వివేకా హత్య కేసుని జనం ముందు పెట్టడం వంటివి చేశారు. అయినా అది పెద్దగా పండినట్లుగా లేదు. మొత్తానికి వైసీపీ అధికారంలోకి దిగిపోయింది. దాని వల్ల కొంత సంతోషించి ఉండవచ్చు కానీ ఏపీలో గత ఆరేడు నెలలుగా చూస్తే కాంగ్రెస్ అయితే ఏ మాత్రం ఎత్తిగిల్లలేదు.
ఈ రోజుకీ వైసీపీ గిట్టదు అనుకున్న వారు నేరుగా కూటమి తలుపులు కొడుతున్నారు. దాంతో కాంగ్రెస్ కి పెద్దగా కలిసిరావడంలేదు. ఇక షర్మిల అయితే జనంలోకి వచ్చి ఏ విమర్శ చేసినా జగన్ మీదనే విరుచుకు పడుతున్నారు. అందులోనే తన రాజకీయాన్ని చూసుకుంటూ తృప్తి పడుతున్నారు. అంతే తప్ప కాంగ్రెస్ ని బలోపేతం చేసే చర్యలను ఆమె చేపట్టడం లేదు అన్నది అయితే ఉంది.
ఇక మొదట్లో కాంగ్రెస్ సీనియర్లు కొందరు షర్మిల వెంట నడచారు. కేంద్ర మాజీ మంత్రులు కూడా ఆమెతో కనిపించారు. ఇపుడు చూస్తే ఎవరూ సీన్ లోకి రావడం లేదు. రఘువీరారెడ్డి, సాకే శైలజానాధ్ వంటి వారు కూడా యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు.
ఈ నేపధ్యంలో పది నెలల షర్మిల పీసీసీ పాలన అయితే రాణింపుగా లేదు అని అంటున్నారు. షర్మిల తన తీరుని మార్చుకుని టీడీపీ కూటమి మీద రాజకీయ సమరం ప్రకటించాల్సి ఉందని అంటున్నారు. లేకపోతే ఏపీలో మళ్లీ మళ్ళీ కాంగ్రెస్ కి భంగపాటు తప్పదని అంటున్నారు.