Begin typing your search above and press return to search.

గ‌డ‌ప‌దాట‌ని ష‌ర్మిల‌.. మంచి ఛాన్స్ మిస్స‌వుతున్నారే.. !

ఉదాహ‌ర‌ణ‌కు వ‌లంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా 4 ల‌క్ష‌ల మందికిపైగానే ఉన్నారు. వీరంతా కూట‌మి బాధితులు.

By:  Tupaki Desk   |   4 March 2025 9:00 PM IST
గ‌డ‌ప‌దాట‌ని ష‌ర్మిల‌.. మంచి ఛాన్స్ మిస్స‌వుతున్నారే.. !
X

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు.. వైఎస్ ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్స‌వుతున్నారా? ప్ర‌స్తుతం నెల‌కొన్న గ్యాప్ ను ఆమె త‌న‌కు, పార్టీకి అనుకూలంగా మ‌లుచుకోలేక పోతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజకీయ ప‌రిశీల‌కులు. రాజ‌కీయంగా ప్ర‌స్తుతం ఏపీలో ఒక పెద్ద గ్యాప్ అయితే క‌నిపిస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వం పై అంతో ఇంతో పెరుగుతున్న వ్య‌తిరేక‌తను అందిపుచ్చుకునేందుకు వైసీపీ పెద్ద‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. చేసిన చోట ఆపార్టీ వైపు ప్ర‌జ‌లు కూడా చూడ‌డం లేదు.

ఉదాహ‌ర‌ణ‌కు వ‌లంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా 4 ల‌క్ష‌ల మందికిపైగానే ఉన్నారు. వీరంతా కూట‌మి బాధితులు. వీరిని కొన‌సాగిస్తామ‌ని చెప్పినా.. ఇత‌ర కార‌ణాల‌తో కూట‌మిస‌ర్కారు వీరిని పక్క‌న పెట్టింది. దీంతో వీరు ఎటు మొగ్గు చూపాల‌న్న ప్ర‌శ్న అలానే ఉంది. ఇక‌, స‌చివాల‌యాల‌ను దాదాపు సుప్త చేత‌నావ‌స్థ‌కు చేర్చా రు. వీటిలో ప‌నిచేసే కార్య‌క‌ర్త‌లు, ఇత‌ర‌త్రా ఉద్యోగులు కూడా స‌ర్కారు తీరుపై గుర్రుగా ఉన్నారు. ఇక‌, నిరుద్యోగుల సంగ‌తి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు.

త‌మ‌కు ఇస్తామ‌న్న నిరుద్యోగ భృతిని ఇవ్వ‌క‌పోవ‌డంతో వారు కూడా ఆగ్ర‌హంతోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో స‌ర్కారుకు దూరంగా ఉన్న ఇలాంటి వారిని అక్కున చేర్చుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నాలు చేయడం లేదు. ఈ విష‌యం కూట‌మి పార్టీల్లోనూ చ‌ర్చ‌కు వ‌స్తోంది. మ‌రోవైపు.. రాస్ట్రంలో అయితే.. కూట‌మి, లేక‌పోతే వైసీపీ ప్ర‌భుత్వాలే రావాల్సి ఉన్న ప‌రిస్థితి నెల‌కొంది. వీటికి ప్ర‌త్యామ్నాయంగా మ‌రో ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌దా? అనే చ‌ర్చ కూడా ఉంది.

ఇలా.. ఎటు చూసినా.. ఒక నిర్దేశిత పొలిటిక‌ల్ `గ్యాప్‌` అయితే.. స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రి దీనికి ప్ర‌త్యా మ్నాయం ఏంటి? అంటే.. అంద‌రి చూపూ కాంగ్రెస్‌పైనే ఉంది. కానీ, పార్టీ రాష్ట్ర చీఫ్‌గా ఉన్న ష‌ర్మిల మాత్రం గ‌డ‌ప దాట‌డం లేదు. కేవ‌లం సోష‌ల్ మీడియాకు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారు. వాస్త‌వానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ అంటే.. కీల‌క‌మైన బాధ్య‌త‌ల‌తో కూడుకున్న‌ది. కానీ, ఆ దిశ‌గా ష‌ర్మిల ఎక్క‌డా ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌న్న‌వాద‌న వినిపిస్తోంది. ఈ గ్యాప్‌ను అందిపుచ్చుకుంటే.. జ‌గ‌న్పై ఆమె నోరు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండానే వైసీపీని ప్ర‌జ‌ల‌కు దూరం చేయొచ్చ‌న్న వాద‌న కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.