షర్మిల పర్సనల్ ఇష్యూస్ మాట్లాడితే వైసీపీ నేతల పరిస్థితి అదా?
ఇదే సమయంలో ప్రభుత్వానికి పలు సూచన్లు చేస్తున్నారు షర్మిల. ఈ నేపథ్యలో 'పర్సనల్ ఇష్యూస్' అనే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 5 Dec 2024 7:27 AM GMTఏపీ రాజకీయాల్లో ‘షర్మిల వర్సెస్ వైసీపీ’ అనే ఇష్యూ రోజు రోజుకీ వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. అంశం ఏదైనా, సందర్భం మరేదైనా ఏపీ పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల ఎంట్రీ ఇస్తుండటం.. దీనిపై ప్రతిపక్షాన్ని తీవ్రస్థాయిలో విమర్శించడం తెలిసిందే! ఇదే సమయంలో ప్రభుత్వానికి పలు సూచన్లు చేస్తున్నారు షర్మిల. ఈ నేపథ్యలో 'పర్సనల్ ఇష్యూస్' అనే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... షర్మిలను రాజకీయ నాయకురాలిగా ఎవరు గుర్తించడం లేదని.. తాము కూడా అంతే అని.. పీసీసీ చీఫ్ గా ఆమె పర్సనల్ టార్గెట్స్ కాకుండా విసృత అంశాలపై దృష్టి సారించాలన్నట్లుగా బొత్స సత్యనరాయణ సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన షర్మిల... పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉంటుందన్నట్లుగా బొత్స సత్యనారాయణ తీరు ఉందని అన్నారు!
అందుకే తాను మాట్లాడేది వ్యక్తిగతం అనుకుంటున్నారని అన్నారు. మీ నిర్లక్ష్యం, అవినీతి, మధ్య నిషేధమని చెప్పి కల్తీ మద్యం అమ్మడం గురించి మాట్లాడితే అది వ్యక్తిగతమా అని ప్రశ్నించారు. వివేకా హత్య, రూ.1,750 కోట్ల లంచాలు, గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అదానీకి కారుచౌకగా విక్రయించడం గురించి మాట్లాడితే అవి పర్సనల్ ఎలా అవుతాయో వైసీపీ నేతలు చెప్పాలని అన్నారు.
ఈ నేపథ్యంలోనే... తాను వ్యక్తిగతంగా మాట్లాడితే వైసీపీ నేతలు ఇంట్లో నుంచి అడుగు కూడా బయటపెట్టలేరని షర్మిల ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం అరాచకాలపై మాట్లాడితే అది పర్సనల్ ఎలా అవుతుందని నిలదీశారు. సెకీ ఒప్పందాలపై తాము వితండవాదం చేయాల్సిన అవసరం లేదని షర్మిల స్పష్టం చేశారు.
ఇదే సమయంలో... సెకీ ఒప్పందంలో జగన్ అవినీతిపై అన్ని ఆధారాలు దగ్గరపెట్టుకుని కూడా కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది అని షర్మిల ప్రశ్నించారు. కాకినాడ పోర్టునే కాదు.. కృష్ణంపట్నం పోర్టు, గంగవరం పోర్టుల విషయంలోనూ సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మరోపక్క.. సెకీతో ఒప్పందాలపై లోతుగా పరిశీలన చేయాలని కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ లేఖ రాస్తున్నామని అన్నారు. ఇదే సమయంలో... సెకి ఒప్పందంపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని షర్మిల తెలిపారు.