అదానీ ఇష్యూలో జగన్ పై షర్మిల తీవ్ర విమర్శలు.. తెరపైకి 'మోదానీ' టాపిక్!
ఈ సమయంలో కేంద్రంలో మోడీని ఇప్పటికే టార్గెట్ చేయగా.. తాజాగా ఏపీలో జగన్ ని తగులుకున్నారు వైఎస్ షర్మిల.
By: Tupaki Desk | 22 Nov 2024 7:56 AM GMTగౌతం అదానీపై అమెరికాలో కేసు నమోదైన వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహరం పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ.. తన రాజకీయ ప్రత్యర్థులను గట్టిగా తగులుకుంటుంది. ఈ సమయంలో కేంద్రంలో మోడీని ఇప్పటికే టార్గెట్ చేయగా.. తాజాగా ఏపీలో జగన్ ని తగులుకున్నారు వైఎస్ షర్మిల.
అవును... అదానీ - జగన్ వ్యవహారంపై రకరకాల కథనాలు తెరపైకి వస్తోన్న నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా... జగన్ కు అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని షర్మిల అన్నారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... అవినీతి కేసుతో అదానీ దేశం పరువు తీస్తే.. జగన్ ఏపీ పరువు తీశారని షర్మిల మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆధారాలు ఉన్నందునే కేసులు పెట్టినట్లు ఆ ఏజెన్సీలు చెబుతున్నాయని.. అమెరికా ఏజెన్సీలు అబయటపెట్టే వరకూ ఇది బయటకు రాకపోవడం చూస్తుంటే దేశంలో పరిస్థితి అర్ధమవుతుందని తెలిపారు.
అదానీతో జగన్ ప్రభుత్వం సోలార్ పవర్ కు సంబంధించి 25 ఏళ్లకు ఏ డీల్స్ అయితే చేసుకుందో అది వెంటనే రద్దు చేయాలని చెప్పి చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని షర్మిళ అన్నారు. ఇదే సమయంలో.. అంతర్జాతీయ స్థాయిలో అదానీ అవినీతిపరుడిగా డిక్లేర్ అయ్యాడు కాబట్టి ఆయనను ఏపీలో బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.
దేశంలో ఇప్పటికే వందల కోట్ల "మోదానీ" స్కాంలు ఉన్నాయని.. వీటిపై ఎంక్వైరీలు వేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు మొత్తుకుందని.. అయినప్పటికీ ఈడీ, సీబీఐ, సెబీ, ఐటీ లు అదానీపై ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదని.. ఒక్క విచారణ కూడా చేపట్టలేదని షర్మిల ఫైర్ అయ్యారు.
అయితే.. అమెరికాలోని సంస్థ అదానీ అవినీతికి పాల్పడ్డాడు అని చెబుతున్నా.. ఎఫ్.ఐల్.ఆర్. లాంటిది నమోదు చేసినా కూడా మోడీ ఇప్పటికీ యాక్షన్ తీసుకోకపోతే.. మోడీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాడనే విషయం దేశ ప్రజలకు అర్ధమవ్వాలన్ని.. అవుతుందని షర్మిల అన్నారు.