"బాబాయ్ ఎందుకిలా?"... సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ షర్మిల!
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 26 Oct 2024 12:31 PM GMTఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ - షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తులకు సంబంధించిన వ్యవహారంపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... సోదరి షర్మిలపై ప్రేమ, ఆప్యాయతతో తన స్వార్జితమైన నాలుగు సంస్థల్లో 40శాతం వాటాను ఇస్తూ జగన్ రాసిచ్చారని అన్నారు.
ఇదే సమయంలో... తనకు తెలిసినంతవరకూ జగన్ స్వార్జిత ఆస్తిలో ఎక్కడా షర్మిల ప్రమేయం లేదని.. నిజంగా ఆ ఆస్తుల్లో షర్మిలకు వాటా ఉండి ఉంటే.. ఆమెపై ఆనాడే కేసులు ఎందుకు నమోదు కాలేదు.. జగన్ ఒక్కరే ఎందుకు జైలు వెళ్లారు.. జగన్ కంపెనీలో షేర్ హోల్డర్ కాబట్టే ఆయనకు డివిడెండ్ వచ్చింది అని స్పష్టం చేశారు.
అందులో నుంచే తన చెల్లికి ఈ పదేళ్లలో రూ.200 కోట్లు ఇచ్చారని.. అంతేతప్ప షర్మిల అందులో షేర్ హోల్డర్ కాదని.. అవి జగన్ సొంత కపెనీలని.. అందుకే వాటికి భారతి సిమెంట్స్ అని.. తన పేరు, తన భార్య పేరు కలిసొచ్చేలా జగతి పబ్లికేషన్స్ అని పెట్టుకున్నారని క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై షర్మిళ తాజాగా స్పందించారు.
అవును... వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు సమాధానాలు ఇస్తూ మరికొన్ని ఎదురు ప్రశ్నలు వేశారు. ఇందులో భాగంగా... కంపెనీలకు భారతి, జగతి అని వాళ్ల పేర్లు పెట్టుకున్నారంటే అందుకు రాజశేఖర్ రెడ్డి అనుమతి ఇవ్వడమే కారణమని అన్నారు.
ఇదే సమయంలో... ఆస్తులు మొత్తం జగన్ వి కాబట్టే ఆయన జైలుకు వెళ్లారని సుబ్బారెడ్డి చెబుతున్నారని.. మరి భారతి పేరు మీద ఆస్తులు ఉంటే ఆమె ఎందుకు జైలుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఈ మాటలు ఎవరో మాట్లాడితే బాధపడేదాన్ని కాదు కానీ.. బాబాయ్ మాట్లాడితే కళ్లల్లో నీళ్లు తిరిగాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె కంటతడి పెట్టుకున్నారు.
అనంతరం... జగన్ పదవులు ఇస్తే సుబ్బారెడ్డి అనుభవిస్తున్నారని.. ఆయన అలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతారని.. జగన్ సీఎంగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డితో పాటు ఆయన కుమారుడు ఆర్థికంగా లాభపడ్డారని అన్నారు. నేడు సుబ్బారెడ్డే కాదు.. రేపు సాయిరెడ్డి కూడా ఇలాగే మాట్లాడోచ్చని షర్మిల అభిప్రాయపడ్డారు.
ఈ సమయంలో... నలుగురు మనవళ్లకు ఆస్తిలో సమాన వాటా అని రాజశేఖర్ రెడ్డి బ్రతికుండగానే చెప్పారని.. ఇది నిజమని నా బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతానని చెప్పిన షర్మిల.. ఇది నిజం కాదని సుబ్బారెడ్డి తన పిల్లలు, మనవళ్లపై ప్రమాణం చేసి చెప్పగలరా అని ఆమె ఛాలెంజ్ విసిరారు!
కాగా... తాను జగన్ కి ఓ లేఖ రాస్తే.. అది ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ అయితే.. నాకేమి సంబంధం అంటూ వైఎస్సార్ అభిమానులకు రాసిన 3 పేజీల లేఖలో ప్రశ్నించిన షర్మిల... నా వరకూ నేను గానీ, నా మనుషులు గానీ బయటపెట్టలేదని.. తానైతే బైబిల్ పై ప్రమాణం చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పిల్లలపై ప్రమాణం చేస్తానని షర్మిళ తెలిపారు!