Begin typing your search above and press return to search.

షర్మిల ముందు జగన్...వాలంటీర్లు !

ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రులు ఎమ్మెల్యేలు అంతా మారు మూలకు కూడా తిరిగి ప్రజల బాగోగులు చూడాలని కోరారు.

By:  Tupaki Desk   |   11 Sep 2024 2:30 AM GMT
షర్మిల ముందు జగన్...వాలంటీర్లు !
X

విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించేందుకు కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల వచ్చారు. ఆమె బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రులు ఎమ్మెల్యేలు అంతా మారు మూలకు కూడా తిరిగి ప్రజల బాగోగులు చూడాలని కోరారు.

అయితే ఎవరూ రాలేదని బాధితులు అంటున్నారని షర్మిల మీడియా ముందు చెబుతూంటే బాధితుల నుంచి జగన్ బాబు ఒక్కరే వచ్చారు అని చెప్పడం జరిగింది. ఆ బాబే నీళ్ళలోకి దిగి మరీ పరామర్శించారు అని కూడా వారు అన్నారు. అంతే కాదు బాధితులకు ఆహార పొట్లాలను ఎక్కడో దూరంగా ఉంచి ఇస్తున్నారని అలా కాకుండా ఇంటింటికీ పంపిణీ చేయాలని షర్మిల ప్రభుత్వాన్ని కోరారు.

ఇదే సమయంలో బాధితులు వాలంటీర్లు ఉన్నారని వారి ద్వారా పంపిణీ చేయించాలని కోరడం జరిగింది. అయితే షర్మిల మాత్రం టీడీపీతో పాటు వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు సందించారు. ఏపీకి చెందిన పాతిక మంది ఎంపీలూ మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారని అయినా ఏపీకి మోడీ ఇచ్చింది ఏమీ లేదని దుయ్యబట్టారు.

వరద నష్టం ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలుగా ప్రభుత్వం అంచనా వేసిందని తక్షణ సాయంగా అయినా కేంద్రం ఆ నిధులను విడుదల చేయాలని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఏపీకి చెందిన వైసీపీ టీడీపీ ఎంపీలు ఊడిగం చేయడం వల్లనే ఏమీ చేయడం లేదని కూడా ఆమె విమర్శించారు. ఇవాళ కాదు పదేళ్లుగా అదే పని చేస్తున్నారని అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా మోడీ ప్రభుత్వానికే మద్దతు అని టీడీపీ వైసీపీల మీద విరుచుకుపడ్డారు.

మరో వైపు చంద్రబాబు వరద బాధిత కుటుంబానికి ఒక్కో ఇంటికీ పదిహేను వేల రూపాయలు తక్షణ సాయం చేసి ఆదుకోవాలని అన్నారు. చంద్రబాబుకు ఉన్న మంచి పేరుని నిలబెట్టుకోవాలని కూడా షర్మిల సూచించడం విశేషం.

ఇక వరద ప్రాంతాలలో ఆక్రమణల మీద కూడా ఆమె మాట్లాడారు, వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యేలు ఎవరూ రాలేదని బాధిత ప్రజలు షర్మిల దృష్టికి తీసుకుని వచ్చారు. షర్మిల మాత్రం వరద సాయం మీద టీడీపీ ప్రభుత్వం అన్నీ ఇచ్చామని అంటోంది, బాధితులు ఇవ్వలేదని అంటున్నారని దీనిని గమనించాలని కోరడం విశేషం.

మొత్తం మీద చూస్తే షర్మిల పర్యటనలో స్థానికులు అయితే తమకు న్యాయం జరగడం లేదని మొర పెట్టుకున్నారు. వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని కోరారు. అలాగే తమకు ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. షర్మిల వీటి మీద మాట్లాడుతూ ఒక్కో కుటుంబానికి లక్ష ఇవ్వాలని మొదట కోరారు. అందులో తక్షణ సాయంగా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఏడు లక్షల ప్రజలు వరదల వల్ల ఇబ్బందులు పడ్డారని అన్నారు. మరి ఒక్కో కుటుంబానికి పదిహేను వేల రూపాయలు ఆర్ధిక సాయం అయినా ఏపీ ప్రభుత్వానికి వందల కోట్లు ఖర్చు అవుతుంది, చూడాలి మరి షర్మిల డిమాండ్ ని కూటమి ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో.