ఏపీకి కావాల్సింది.. విజన్ కాదు.. విభజన హామీలు: షర్మిల
శుక్రవారం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం విజన్-2047ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 14 Dec 2024 9:30 AM GMTఏపీలోని కూటమి సర్కారుపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నేరుగా ఎటాక్ చేశారు. నిన్న మొన్నటి వరకు అన్న జగన్‌పై నిప్పులు కురిపించిన షర్మిల.. అనూహ్యంగా ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఏపీకి సంబంధించిన సమస్యలపై ఆమె గళం వినిపించారు. తాజాగా ఎక్స్‌లో ఆమె కూటమి సర్కారుపై నిప్పులు చెరిగారు. ఏపీకి కావాల్సింది.. విజన్ కాదని, విభజన హామీలు సాధించే ప్రభుత్వమని తేల్చి చెప్పారు. శుక్రవారం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం విజన్-2047ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
దీనిని తప్పుబడుతూ.. చంద్రబాబు మరోసారి అరచేతిలో వైకుంఠం చూపించారని ఆమె మండి పడ్డారు. ఏపీ అభివృద్ధి చెందాలన్నా.. ఉద్యోగాలు రావాలన్నా.. పరిశ్రమలు రావాలన్నా.. కావాల్సింది.. విభజన హామీలేనని నొక్కి చెప్పారు. బంగారు బాతు లాంటి విభజన హామీలను వదిలేసి.. విజన్ ను పట్టుకుని వేలాడుతున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటివి సాధించడం ద్వారానే ఏపీ అభివృద్ధి సాకారం అవుతుందని తేల్చి చెప్పారు.
షర్మిల డిమాండ్లు ఇవీ..
+ రాజధాని అమరావతికి ఆర్థిక సాయం
+ బుందేల్ ఖండ్ తరహాలో వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ
+ ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన
+ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు
+ కడప స్టీల్, దుగ్గరాజుపట్నం పోర్టుల నిర్మాణం
+ రైల్వే జోన్, పెట్రోలియం యూనివర్సిటీ
+ విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్
+ విజయవాడ, విశాఖలో మెట్రో రైల్
+ హైదరాబాద్ నుంచి విజయవాడకు ర్యాపిడ్ రైల్
ఇవన్నీ.. విభజన చట్టంలోని షెడ్యూల్ 13లో పొందపరించినవేనని, గత యూపీఏ హయాంలో ఇవన్నీ హామీలు రాష్ట్రానికి ఇచ్చారని.. వీటిని సాధించడం ద్వారానే ఏపీ అభివృద్ధి చెందుతుందని షర్మిల తెలిపారు. వీటిని సాధించి ఉంటే.. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగేదని పేర్కొన్నారు. కానీ, వీటిని వదిలేసి.. తప్పు చేస్తున్నారని తలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా చంద్రబాబు, జగన్‌లు ఏపీని నాశనం చేస్తున్నారని షర్మిల మండి పడ్డారు.
హామీలు సాధిస్తే..
+ పదేళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు వచ్చేవి.
+వేల సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేవి.
+ లక్షల్లో ఉపాధి అవకాశాలు లభించేవి.
+ పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది
+ విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం జరిగితే ప్రధాన నగరాలుగా అభివృద్ధి చెందేవి- అని షర్మిల పేర్కొన్నారు.
బీజేపీ మోసం..
ఏపీని బీజేపీ నిండా ముంచేసిందని షర్మిల విమర్శించారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ.. కనీసం ఈ ఊసు కూడా ఎత్తడం లేదని మండిపడ్డారు. 25 మంది ఎంపీలు ఇస్తే హోదా ఎందుకు ఇవ్వరో చూస్తాంటూ శపథం చేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు.