"ఉచిత బస్సు"పై ప్రభుత్వం ప్రకటన... షర్మిల సంచలన వ్యాఖ్యలు!
ఈ సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా.. దానిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 21 Dec 2024 9:23 AM GMTఏపీలో ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం ఒకటనే సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయినా ఈ పథకం ఇంకా అమలుకు నోచుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా.. దానిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీలో కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత అర్టీసీ బస్సు ప్రయాణం హామీపై తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ఇప్పటికీ అమలుకు నోచుకోవడంపై మహిళలు పెదవి విరుస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో.. ఈ పథకం అమలుపై మంత్రుల బృందంతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇందులో భాగంగా... ఇప్పటికే ఈ పథకం అమలులో ఉన్న కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నివేదిక వచ్చిన అనంతరం.. దాని ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కు అనువైనట్లుగా ఈ పథకాన్ని అమలుచేయానున్నారని అంటున్నారు.
ఈ మంత్రుల బృందంలో... రవాణా, మహిళా-శిశు సంక్షేమ శాఖలతో పాటు హోంశాఖ మంత్రులు సభ్యులుగా ఉంటూరు. మరోపక్క ఈ విషయంపై స్పందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే ఏపీలో ఉచిత బస్సు సర్వీసు ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని అన్నారు.
కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు - షర్మిల!:
ఈ నేపథ్యంలో... ఈ మంత్రుల కమిటీపై షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా... మహిళకు ఉచిత బస్సు బథకం అమలుపై టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. కాలయాపన తప్ప ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం లేదని.. అధికారం చేపట్టిన 6 నెలల్లో పండుగలు, పబ్బాలు పేరు చెప్పి దాటేశారని మండిపడ్డారు.
ఇప్పుడు మరళా మంత్రివర్గ ఉపసంఘం పేరుతో రోజులు సాగతీతకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును పలు ప్రశ్నలు సంధిస్తుందని చెబుతూ... ఉచిత ప్రయాణం కల్పించడంలో ఇన్ని బాలారిష్టాలు ఎందుకు..? చిన్న పథకం అమలుకు కొండంత కసరత్తు దేనికోసం..? అని నిలదీశారు!
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పథకం అమలు చేసి చూపించారు కదా? ఉన్న బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు కదా? పథకం అమలును బట్టి అదనపు ఏర్పాట్లు చేశారు కదా? అని చెబుతూ ప్రశ్నించిన షర్మిళ... జీరో టిక్కెట్ల కింద నెలకు రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడానికి మీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా... మహిళల భద్రతకు మీకు మనసు రావడంలేదా..? ఈ పథకం అమలుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి..? అని అని ప్రశ్నించిన షర్మిల... కనీసం నూతన సంవత్సర కానుకగా అయినా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీ చిత్తశుద్ది ఏంటో నిరూపించుకోవాలని సూచించారు.