జగన్ ని మానసిక క్షోభకు గురి చేసిన ఆమె ?
ఇవన్నీ ఇపుడు ఎందుకు అంటే జగన్ గురించి అందరి కంటే ఎక్కువ తెలిసిన ఆమె ఆయనకు దూరం అయ్యారు. ఆమె ఎవరో కాదు రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు వైఎస్ షర్మిల.
By: Tupaki Desk | 23 Oct 2024 12:30 PM GMTవైఎస్ జగన్ అంటేనే ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఆయన పట్టుదలకు మారు పేరుగా ఉంటారని కూడా అంటారు. జగన్ ముక్కుసూటిగా ఉంటారు. తాను ఏది నిజం అని నమ్మితే దానినే అమలు చేస్తారు. ఈ విషయంలో రెండవ మాట అనేదే ఉండదు, అంతే కాదు తనను కాదు అనుకున్న వారి విషయంలో ఆయన అవసరమైతే కఠినంగా కూడా ఉంటారు.
ఇవన్నీ ఇపుడు ఎందుకు అంటే జగన్ గురించి అందరి కంటే ఎక్కువ తెలిసిన ఆమె ఆయనకు దూరం అయ్యారు. ఆమె ఎవరో కాదు రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు వైఎస్ షర్మిల. ఆమె జగన్ కి ఎదురు నిలిచి 2024 ఎన్నికల్లో పోరాడారు. కాంగ్రెస్ తరఫున ఏపీకి వచ్చి జగన్ కి ఎంత నష్టం చేయాలో అంతా చేశారు.
ప్రతీ కుటుంబంలో విభేదాలు ఉండడం సహజమే కానీ అవి వైఎస్సార్ ఫ్యామిలీలో పీక్స్ కి వెళ్ళిపోయాయి. ఇపుడు అవి బాహాటం అయ్యాయని తెలుస్తోంది. జగన్ హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)కి సమర్పించిన పిటిషన్‌లో షర్మిల పట్ల ప్రస్తుతం తనకు ఉన్న భావాలు ఏమిటో కుండబద్దలు కొట్టారు అని అంటున్నారు.
ఆమె అంటే వైఎస్ షర్మిల, కృతజ్ఞత లేకుండా, నా శ్రేయస్సు గురించి పట్టించుకోకుండా, నన్ను తీవ్రంగా బాధించే చర్యలు చేస్తూ వెళుతోంది అని ఆయన కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొనడం విశేషం. అంతే కాదు ఆమె చేసిన పనులే కాకుండా, బహిరంగంగా అసత్య, తప్పుడు ప్రకటనలతో పాటు, రాజకీయంగా నన్ను వ్యతిరేకించింది అని కూడా ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలను ఆయన ప్రస్తావించారు.
ఇక ఆమె వైఖరితో తనకు వ్యక్తిగతంగా అపకీర్తిని కలిగించాయని కూడా ఆయన చెప్పడం విశేషం. మొత్తానికి చూస్తే కనుక తన సోదరి షర్మిల తీరు వల్ల తనకు ఎంతో మానసిక క్షోభను కూడా కలిగించిందని వైఎస్ జగన్ తెలిపారు.
ఈ క్రమంలోనే తమ మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతలన్నీ దెబ్బతిన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇక తన మీద ఆమె చేసిన ఆరోపణలన్నీ రాజకీయంగా ప్రేరేపించినవి ఇవి తనకు తీవ్ర వేదనకు గురిచేశాయని వైఎస్ జగన్ అన్నారు. ఇవన్నీ కూడా సరస్వతీ పవర్ కంపెనీలో వాటాలకు సంబంధించి ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల తనను తీవ్రంగా మానసిక క్షోభకు గురి చేశారు అని జగన్ చెప్పడం మాత్రం విశేషంగా పేర్కొంటునారు. ఎందుచేతనంటే ఈ అన్నాచెల్లెళ్ళు ఎప్పటికి అయినా కలుస్తారు అని అంతా అనుకున్నారు. కానీ ఇద్దరి దారులు వేరు అని అర్ధం అవుతోంది అంటున్నారు. రాజకీయాల్లో అన్నకు పోటీగా షర్మిల వేరే పార్టీ ద్వారా ముందుకు సాగుతున్నారు. అయితే ఇది కూడా ఏమంత పెద్ద విశేషం కాదు.
ఒకే కుటుంబం నుంచి చాలా మంది వేరు వేరు పార్టీల ద్వారా రాజకీయం చేయడాన్ని అంతా చూస్తున్నారు. వారు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకుండా తమ దోవలో వెళ్తున్నారు. కానీ ఇక్కడ అది కాదు మ్యాటర్. తన రాజకీయం సంగతి ఎలా ఉన్నా జగన్ విషయంలో షర్మిల తీవ్రంగానే ముందుకు సాగుతున్నారని అంటున్నారు.
జగన్ ని మాజీ సీఎం ని చేసిన ఘనత టీడీపీ కూటమి దక్కించుకున్నప్పటికీ అందులో ఉడతా సాయం షర్మిల కూడా చేశారు అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తో కుండబద్ధలు కొట్టేశారని తనను షర్మిల మానసిక క్షోభకు గురి చేస్తున్నారు అని అసలు విషయం చెప్పేశారని అంతా అంటున్నారు. ముందు ముందు ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.