ఎంపీల తోపులాట.. అంబేడ్కర్ పై షా వ్యాఖ్యలను కప్పిపుచ్చేందుకే: షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఏ తెలుగు నాయకుడూ గుర్తించని కోణాన్ని ఆమె గుర్తించారు.
By: Tupaki Desk | 20 Dec 2024 11:39 AM GMTఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఏ తెలుగు నాయకుడూ గుర్తించని కోణాన్ని ఆమె గుర్తించారు. తాజాగా ముగిసిన పార్లమెంటు సమాశాలు అత్యంత వాడివేడిగా సాగిన సంగతి తెలిసిందే. దీంతోపాటు గురువారం పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీల తోపులాట అత్యంత వివాదాస్పదం అయింది.
అదానీ, మణిపూర్, ఢిల్లీ
పార్లమెంటు శీతాకాల సమావేశాలు అత్యంత హాట్ హాట్ గా సాగాయని చెప్పడంలో తప్పు లేదు. గత నెల 25న మొదలైన ఈ సమావేశాలు గురువారం వరకు ప్రతి రోజూ చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇక సరిగ్గా సమావేశాలకు ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు, మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగడం, ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం మీద రగడ ఖాయం అని భావించారు. ఇదే సమయంలో జమిలి ఎన్నికల బిల్లులు తోడయ్యాయి. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు (జమిలి ఎన్నిక బిల్లును) లోక్ సభ గత శుక్రవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది. మంగళవారం రాజ్యసభలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే, ఇది రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని, సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అన్ని పక్షాలూ విస్తృత చర్చ కోరుతున్నందున ప్రభుత్వం జేపీసీకి పంపింది.
చర్చలో రచ్చ
కాగా బుధవారం పార్లమెంటులో చర్చ సందర్భంగా కేంద్రం హోంమంత్రి అమిత్ షా.. అంబేడ్కర్ గురించి చేసిన వ్యాఖ్యలపై ఇండియా కూటమి పెద్దఎత్తున నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో గురువారం పార్లమెంటు ప్రాగణంలో ఎంపీల తోపులాట జరిగింది. దీనిపైనే షర్మిల స్పందించారు. అంబేడ్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితి కల్పించారని ఆరోపించారు. షా వ్యాఖ్యల వివాదం నుంచి పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు.