Begin typing your search above and press return to search.

జగన్ పులివెందులలో షర్మిల పాగా ?

దేశంలో చూస్తే ఇంత సుదీర్ఘ కాలంలో ఒక అసెంబ్లీ సీటు ఒక కుటుంబం చేతిలో ఉండడం అరుదైన విషయంగానే చూడాలి

By:  Tupaki Desk   |   13 Nov 2024 7:17 AM GMT
జగన్ పులివెందులలో షర్మిల పాగా ?
X

పులివెందుల అంటే 1978 నుంచి వైఎస్సార్ కుటుంబం చేతిలోనే ఉంది. దేశంలో చూస్తే ఇంత సుదీర్ఘ కాలంలో ఒక అసెంబ్లీ సీటు ఒక కుటుంబం చేతిలో ఉండడం అరుదైన విషయంగానే చూడాలి. వైఎస్సార్ ఆయన సోదరుడు వివేకానందరెడ్డి, వైఎస్సార్ సతీమణి విజయమ్మ, అలాగే వైఎస్ జగన్ ఇలా ఈ నలుగురే పులివెందులను పాలించారు, శాసించారు. జగన్ విషయం తీసుకుంటే ఆయన ఉప ఎన్నికలతో కలిపి కడప లోక్ సభకు రెండు సార్లు ఎంపీ అయ్యారు, ఇక పులివెందుల నుంచి 2014, 2019, 2024లో మూడు సార్లు గెలిచారు, ఈ మూడు సార్లలో 2019లో రికార్డు మెజారిటీ వస్తే 2024లో అది కొంత తగ్గింది.

ఇక పులివెందుల నుంచి గెలిచిన జగన్ మూడవ పర్యాయంలో మాత్రం అసెంబ్లీ ముఖం చూడడం లేదు. ఆయన తానుగా సభా బహిష్కరణ చేశారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నది టీడీపీ అయితే కాదు, కాంగ్రెస్ నుంచి ఆయన సొంత చెల్లెమ్మ షర్మిల.

ఆమె ఎందుకు ఇలా అంటున్నారు అన్నది కూడా విశ్లేషించుకోవాల్సి ఉంది. అసెంబ్లీకి వెళ్లని వారు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాల్సిందే అని ఆమె స్పష్టం చేశారు. మీరేదో ప్రజా సమస్యలను ప్రస్తావన చేసి ప్రజల గొంతుకను సభలో వినిపిస్తారు అనుకుంటే అది కాదని చెప్పి సభకు నమస్కారం పెట్టారని ఆమె ఆడిపోసుకుంటున్నారు. అందువల్ల తక్షణం రాజీనామాలు ఇచ్చేయండి అని ఆమె జగన్ నే నేరుగా కోరుతున్నారు.

ఈ విధంగా షర్మిలకు జగన్ విషయంలో ఒక భారీ అస్త్రమే దొరికినట్లు అయింది. అది బ్రహ్మాస్త్రంగా మార్చుకునే దూకుడు రాజకీయం అయితే ఆమె తప్పకుండా చేస్తారనే అంటున్నరు. పులివెందుల అంటే ముందే చెప్పుకుంటున్నట్లుగా వైఎస్సార్ కుటుంబానికి పెట్టని కోట. జగన్ ఒక్కరే ఆ కుటుంబం కాదు షర్మిల కూడా వైఎస్సార్ బ్లడ్ అనే చెప్పాలి.

అందువల్ల అన్న పులివెందుల ప్రజలకు న్యాయం చేయడంలేదని చెల్లెమ్మ ఇక మీదట మరింత ధాటీగా విమర్శలు చేసే చాన్స్ ఉంది. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఈ ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళి అడిగారా అని జనం ముందుకు వచ్చి నిగ్గదీసే పరిస్థితి రానుంది.

ఇకపోతే 2024 ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీ సీటుకు పోటీ చేశారు. అప్పట్లోనే ఆమె పులివెందులకు కూడా పోటీ చేస్తారు అన్న చర్చ వచ్చింది. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, దాంతో సిట్టింగ్ సీటులో సీఎం మీద పోటీ అంటే ఎందుకొచ్చిన రిస్క్ అని భావించి ఆమె తన దాయాది అయిన అవినాష్ రెడ్డి మీద పోటీ చేశారు. ఆమె ఓటమి పాలు అయినా లక్షన్నర దాకా ఓట్ల అయితే తెచ్చుకున్నారు.

అందులో పులివెందుల ఓట్లు కూడా చాలానే ఉన్నాయి. అందుకే 2019 కంటే 2024లో జగన్ మెజారిటీ కూడా పులివెందులలో తగ్గిపోయింది. ఇక ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీకి దక్కినవి 11 సీట్లే కావడంతో వైసీపీ అసలు బలం తెలిసాక షర్మిల కాంగ్రెస్ చీఫ్ గా మరింత స్పీడ్ గా వైసీపీని ఎటాక్ చేస్తున్నారు.

ఇపుడు సభకు గైర్ హాజరు కావాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సితం ఆమె గట్టిగానే ఎండగడుతున్నారు. రానున్న నాలుగున్నరేళ్ళూ ఇదే తీరున సభకు హాజరు కాకుండా వైసీపీ అధినేత వ్యవహరిస్తే మాత్రం పులివెందులలో పాగా వేసేందుకు చెల్లెమ్మకు చాన్స్ దొరికినట్లే అని అంటున్నారు.

పులివెందులలో ఒక ఎమ్మెల్యేగా తన సోదరుడు ఫెయిల్ అయ్యారని చెబుతూ చెల్లెమ్మ వచ్చే ఎన్నికల్లో ఊరూ వాడా తిరిగి విమర్శలు చేస్తే అది కచ్చితంగా జగన్ రాజకీయం మీద ప్రభావం చూపించే చాన్స్ కూడా ఉంటుంది అని అంటున్నారు. ఇక పులివెందుల ఎమ్మెల్యేల హిస్టరీ చూతే ఇప్పటిదాకా ఏ ఒక్క ఎమ్మెల్యే సభకు వెళ్లకుండా లేరు అనే అంటున్నారు.

వైఎస్సార్ సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలో ఉన్నా సభకు అటెండ్ అయ్యేవారు. అలాగే వైఎస్ వివేకా సైతం విపక్షంలో ఉన్నపుడే సభకు పులివెందుల ఎమ్మెల్యేగా వెళ్లారు. వైఎస్ విజయమ్మ సైతం ఉమ్మడి ఏపీలో వైసీపీ తరఫున పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా సభకు వచ్చారు

జగన్ విషయం తీసుకుంటే 2014లో తొలి మూడేళ్ళ పాటు విపక్ష నేతగా పులివెందుల ఎమ్మెల్యేగా సభలో అధికార పక్షాన్ని నిలదీశారు. 2019 నుంచి 2024 వరకూ ఎటూ ఆయన సీఎం గానే ఉన్నారు, కాబట్టి అయిదేళ్లూ పులివెందుల ఎమ్మెల్యే సభలో ఉన్నట్లే లెక్క. ఇపుడు తొలిసారి పులివెందుల ఎమ్మెల్యేగా సభకు గైర్ హాజరయ్యారు.

సరిగ్గా ఈ పాయింటే తీసుకుని చెల్లెమ్మ రేపటి రాజకీయం చూపిస్తారు అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో సీఎం గా జగన్ పాలనా తీరుని ఎండగట్టిన షర్మిల ఇపుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన పనితీరుని ఎండగట్టి అక్కడే జెండా పాతాలని చూస్తున్నారు అని అంటున్నారు. సో షర్మిలకు పులివెందులలో చోటు దొరికినట్లేనా అంటే వైసీపీ అధినాయకత్వం వైఖరి ఇదే తీరుగా ఉంటే అది షర్మిలకే లాభం అని అంటున్నారు.