"బెయిల్ రద్దు గురించి అప్పుడు తెలియదా?"... మరో లేఖ వదిలిన షర్మిల!
ఈ సమయంలో ఆ లేఖపై షర్మిల స్పందించారు.
By: Tupaki Desk | 30 Oct 2024 9:39 AM GMTవైఎస్ జగన్, షర్మిల మధ్య నెలకొన్న ఆస్తుల తగాదాల వ్యవహారంపై స్పందించిన విజయమ్మ... తన పిల్లల ఆస్తుల వివాదంపై ఎవరూ మాట్లాడొద్దు.. సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దు.. దూషణలు చేయవద్దు.. ఈ కుటుంబం మీద ప్రేమ ఉంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు.. అని వైఎస్ విజయమ్మ అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా లేఖను విడుదల చేసిన విజయమ్మ.. పలు కీలక, ఆసక్తికర, సంచలన విషయాలను వెల్లడించారు. ఫైనల్ గా.. వైఎస్సార్ కుటుంబ ఆస్తుల పంపకాలు జరగలేదని అన్నారు. షర్మిలకు న్యాయం చేయడం జగన్ బాధ్యత అని స్పష్టం చేశారు! ఈ సమయంలో విజయమ్మ లేఖపై వైసీపీ కూడా ఆరు పాయింట్లతో ఓ లేఖ వదిలింది.
ఇందులో భాగంగా... విజయమ్మ రాసిన లేఖలో జగన్ బెయిల్ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని కనీసం ప్రస్థావించకపోవడం ప్రజలను పక్కదోవ పట్టించడమే అని పేర్కొంది. షర్మిల భావోద్వేగాలకు, ఒత్తిళ్లకు గురై జగన్ కి చట్టపరంగా చిక్కులు తెచ్చే ఈ పనికి తెలిసి కూడా విజయమ్మ సంతకం పెట్టడం నిజమే కదా? అని ప్రశ్నించింది.
ఇదే సమయంలో... వైఎస్సార్ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేసే ఇలా వ్యవహరించడం ధర్మమేనా? అని నిలదీసింది! జగన్ కి షర్మిల రాసిన వ్యక్తిగత ఉత్తరం టీడీపీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం, విజయమ్మ కూడా సంతకం చేసిన ఆ ఉత్తరాన్ని టీడీపీ వారు విడుదల చేయడంపైనా ప్రశ్నించింది.
ఈ వ్యవహారంపై ఇక ఎవరూ మాట్లాడొద్దు అని కోరిన కొన్ని గంటల్లోనే విజయమ్మ ముందుకు పలు అంశాలను తీసుకొస్తున్నామంటూ ఓ లేఖ విడుదల చేసింది వైసీపీ! ఈ సమయంలో ఆ లేఖపై షర్మిల స్పందించారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర జరుగుతుందంటూ ఆ పార్టీ నేతలు పేర్కొనడాన్ని శతాబ్దపు అతి పెద్ద జోక్ అని ఆమె అన్నారు.
అవును... విజయమ్మ రాసిన లేఖలో జగన్ బెయిల్ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని కనీసం ప్రస్థావించకపోవడం ప్రజలను పక్కదోవ పట్టించడమే అని వైసీపీ రాసిన లేఖపై స్పందిస్తూ.. షర్మిల మరో లేఖ రాశారు. ఇందులో భాగంగా... ఈడీ అటాచ్ చేసినందువల్ల షేర్లు బదిలీ చేయకూడదు అనడం హాస్యాస్పదం అని అన్నారు.
అసలు.. ఈడీ అటాచ్ చేసింది షేర్లు కాదని, రూ.32 కోట్ల విలువైన కంపెనీ స్థిరాస్తి అని.. షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలూ లేవని.. స్టేటస్ కో ఉన్నది షేర్లపై కాదని.. గతంలో కూడా ఈడీ ఎన్నో కంపెనీల ఆస్తులను అటాచ్ చేసిందని.. అంతమాత్రన్న వాటికి స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్, ట్రాన్స్ ఫర్ లు ఆపలేదని వెల్లడించారు.
100 శాతం వాటాలు బదలాయిస్తామని ఎంవోయూపై జగన్ సంతకం చేశారని.. బెయిల్ రద్దవుతుందనే విషయం సంతకం చేసినప్పుడు తెలియదా అని ప్రశ్నించారు. 2021లో రూ.42 కోట్లకు సండూరు, క్లాసిక్ రియాలిటీ, సరస్వతి షేర్లు విజయమ్మకు అమ్మినప్పుడు బెయిల్ రద్దవుతుందని తెలియదా అని షర్మిల ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలోనే అసలు షేర్ల బదిలీకి, జగన్ బెయిల్ రద్దుకూ ఎలాంటి సంబంధం లేదనే విషయం మీకు తెలుసని.. జగన్ బెయిల్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదనే విషయం విజయమ్మకూ తెలుసని షర్మిల పేర్కొన్నారు.