Begin typing your search above and press return to search.

జమిలిపై బీజేపీని తగులుకున్న షర్మిల... టీడీపీ, వైసీపీ ప్రస్థావన?

ఈ సమయంలో ఈ వ్యవహారంపై వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు.

By:  Tupaki Desk   |   18 Dec 2024 9:24 AM GMT
జమిలిపై బీజేపీని తగులుకున్న  షర్మిల... టీడీపీ, వైసీపీ ప్రస్థావన?
X

ఇప్పుడు దేశంలో రాజకీయంగా అత్యంత హాట్ టాపిక్ "జమిలి ఎన్నికల బిల్లు" అనే చెప్పాలి. ఈ బిల్లు విషయంలో లోక్ సభలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ రాజ్యాంగ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీ (జేపీసీ) పంపించారు. ఈ సమయంలో ఈ వ్యవహారంపై వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు.

అవును... జమిలీ ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని.. రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడి అని.. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ కు విరుద్ధంగా బిల్లును ప్రవేశపెట్టారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

ఇదే సమయంలో... జమిలి ఎన్నికల బిల్లు ద్వారా రాజ్యాంగ విధ్వంసానికి పాల్పడుతున్నారని సమాజ్ వాదీ పార్టీ ఆరోపించగా... జమిలి ఎన్నికలు అంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమేనని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తూ.. ఇవి ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటివని విమర్శించింది. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బీజేపీపై మండిపడ్డారు.

ఇందులో భాగంగా... భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉందని.. డాక్టర్ బీఅర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి, 'బీజేపీ రాజ్యాంగం' అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికల బిల్లులను బీజేపీ లోక్‌ సభలో ప్రవేశపెట్టిందంటూ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.

సభలో పూర్తి మెజార్టీ లేకపోయినప్పటికీ.. రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనమని.. ఇది ఫక్తు నియంతృత్వ చర్య అని.. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని షర్మిల స్పష్టం చేశారు.

ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడం ద్వారా రాజ్యాంగ సవరణలకు కావాల్సిన మూడింట రెండొంతుల బలం బీజేపీకి లేదనే విషయం లో క్‌ సభలో ఓటింగ్‌ తో తేలిందని చెప్పిన షర్మిల... కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి..? అని సూటిగా ప్రశ్నించారు. ఇందులో ఏమన్నా అర్థముందా..? అని నిలదీశారు!

జమిలి ఎన్నికలు జరపాలంటే కేంద్ర, రాష్ట్రాల చట్టసభలకు నిర్ణీత కాల వ్యవధి కల్పించే ఆర్టికల్ 83, 172లను కూడా సవరించాల్సి ఉంటుందని.. తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఐదేళ్ల కాలానికి ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని.. అసెంబ్లీల గడువును లోక్‌ సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమే అవుతుందని.. జమిలి ద్వారా ప్రజల హక్కుకు గండికొట్టే అధికారం కేంద్రానికి లేదని షర్మిల పేరొన్నారు.

ఇదే సమయంలో... దేశంలో నియంతృత్వాన్ని తీసుకురావడమే భారతీయ జనతా పార్టీ ప్రధాన ఉద్దేశం అంటూ మండిపడిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల... రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించే జమిలి ఎన్నికల బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సహకరించదని తేల్చి చెప్పారు.

అయితే... ఈ బిల్లుకు లోక్ సభలో మద్దతు తెలిపిన టీడీపీ, వైసీపీలను షర్మిల ప్రస్థావించకపోవడం గమనార్హం!! దీనిపైనా ఆసక్తికర చర్చ మొదలైందని అంటున్నారు!