Begin typing your search above and press return to search.

బిడ్డల మీద ప్రమాణం చేసి నిజం చెప్పు జగన్

ఏదైనా విషయంలో తన తప్పు లేదు అని ఆమె చెప్పాలనుకున్నపుడు బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను అని చెబుతూ ఉంటారు.

By:  Tupaki Desk   |   28 Nov 2024 6:48 AM GMT
బిడ్డల మీద ప్రమాణం చేసి నిజం చెప్పు జగన్
X

వైఎస్ జగన్ కి కొత్త డిమాండ్ చేశారు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల. ఆమె పీసీసీ చీఫ్ కూడా. షర్మిల అనేక సందర్భాలలో తన బిడ్డల మీద ఒట్టు అని చాలా గట్టిగా చెబుతూ ఉంటారు. ఏదైనా విషయంలో తన తప్పు లేదు అని ఆమె చెప్పాలనుకున్నపుడు బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను అని చెబుతూ ఉంటారు.

ఇపుడు అదే ప్రమాణాన్ని తన అన్న మాజీ సీఎం జగన్ ని చేయమంటున్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి నిజమే చెబుతాను అని కోర్టులలో బోనులో ఉన్న వారి చేత చెప్పిస్తారు. అలా తన సోదరుడు నిజం చెప్పాలని షర్మిల కోరుతూ అదానీ నుంచి ముడుపులు తీసుకున్నారా లేదా అన్న దాని మీద జగన్ తన సొంత బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్ చేశారు

నిజంగా ఈ డిమాండ్ కాస్తా వింతగానే ఉంది. ఎవరికి ఎవరి మీద నమ్మకం ఉంటుందో వారి మీద చేస్తారు. షర్మిల బిడ్డల మీద ప్రమాణం చేస్తారు. జగన్ కి బిడ్డలు అంటే ప్రేమ ఉన్నా వేరే సెంటిమెంట్లు ఉంటే ఆయన దాని మీద ఒట్టు పెట్టవచ్చు. లేదా అసలు ఒట్లు ప్రమాణాలను ఆయన ప్రాక్టీస్ గా చేయకపోవచ్చు.

కానీ చెల్లెమ్మ తన ప్రాక్టీస్ ని జగన్ ముందు పెట్టి అలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దేశంలోనే అతి పెద్ద వ్యాపార దిగ్గజం గౌతమ్‌ అదానీ నాటి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి తన విద్యుత్ సంస్థలకు సంబంధించి రూ.1750 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారు అన్నది ఇపుడు ఏపీలో అతి పెద్ద రాజకీయ సంచలనంగా ఉంది. ఈ తరహా అవినీతి ఆరోపణలు రావడంతో జగన్ మీద ఇటు కూటమి నేతలతో పాటు అటు విపక్షాలు కూడా వేలెత్తి చూపిస్తున్నరు. మరో వైపు షర్మిల కూడా ఇదే ఇష్యూతో జగన్ ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు.

అమెరికాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ బయటపెట్టిన గౌతం అదానీ లంచం వ్యవహారంలో జగన్ పాత్ర కూడా ఉందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అంటున్నారు. అదానీ దేశం పరువుని తీస్తే జగన్ ఏపీ పరువుని తీశారు అని ఆమె ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు జగన్ మీద చర్యలు తీసుకోవాలని కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఈ విషయంలో ఇప్పటిదాకా అయితే మాజీ సీఎం పెదవి విప్పలేదు. వైసీపీ నేతలు మాత్రం ఇది పూర్తిగా సెకీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అని దీనికీ అదానీకి సంబంధం లేదని అంటున్నారు. అయితే షర్మిల మరికాస్తా ముందుకు వెళ్ళి అదానీతో లంచం ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని జగన్ తన పిల్లలపై ఒట్టు పెట్టి గట్టిగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ ఈ విషయంలో పూరిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని షర్మిల ఫైర్ అయ్యారు

అదానీ సంస్థతో జగన్ లంచం తీసుకున్నారు అన్న దాని మీద అడిగితే ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం అదానీ నుంచి ఎటువంటి ముడుపులు తీసుకోకపోతే జగన్ తన పిల్లలపై ప్రమాణం చేయవచ్చు కదా అని కొత్త పాయింట్ ని లేవనెత్తుతున్నారు. జగన్ కనుక అలా చెబితే అప్పుడే ఆయన చెప్పేది నిజమని నమ్మగలమని షర్మిల అంటున్నారు.

ఈ విధంగా తన సొంత అన్న మీదనే షర్మిల డిమాండ్ పెట్టడం ద్వారా జగన్ ఈ విషయంలో తప్పు చేసి ఉంటారని బలంగానే నమ్ముతున్నారని అంటున్నారు. లేకపోతే ఏకంగా పిల్లల మీద ఒట్టు పెట్టమని ఆమె డిమాండ్ చేయడం దాకా ఎందుకు వెళ్తారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా జగన్ మీద ఈ విషయంలో చర్యలు తీసుకునేందుకు ఎంతవరకూ అవకాశాలు ఉన్నాయని పరిశీలిస్తోంది అని అంటున్నారు. ఆ విధంగా ఆధారాలు కనుక ఉన్న పక్షంలో చర్యలకు కూటమి ప్రభుత్వం దిగుతుందని అంటున్నారు.