సింగపూర్ లో షర్మిల ఏం చేస్తున్నారు? ఆ దేశానికి ఎందుకు వెళ్లారు?
సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఏపీలో కనిపించని పరిస్థితి
By: Tupaki Desk | 28 Aug 2024 4:24 AM GMTసోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఏపీలో కనిపించని పరిస్థితి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న వేళ.. బయట మాత్రం కనిపించని పరిస్థితి. దీనిపై ఆరా తీసినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. దీని ప్రకారం.. ఆమె కొద్ది రోజులుగా సింగపూర్ లో ఉంటున్న కొత్త విషయం వెలుగు చూసింది.
రాజకీయంగా మహా చురుగ్గా ఉండే ఆమె.. తనకు లభించిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. కొద్ది రోజుల క్రితం వర్షాలకు గోదావరి జిల్లాల్లో పంట పొలాలు మునిగిపోయినప్పుడు వెంటనే స్పందించిన ఆమె.. ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరటం తెలిసిందే. అంతేనా.. బాధిత ప్రాంతాలకు వెళ్లి.. బురదలోకి దిగి మరీ వారి సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇలా అనూహ్య రీతిలో రియాక్టు అయ్యే షర్మిల.. ఇటీవల విశాఖ సమీపంలోని అచ్యుతాపురం సెజ్ వద్ద అంత పెద్ద ప్రమాదం జరిగిన విషాద ఉదంతంలో ఎక్కడా కనిపించలేదు.
పదిహేడు మంది ప్రాణాల్ని తీసిన అచ్యుతాపురం సెజ్ నిర్లక్ష్యంపై ఆమె గళం విప్పుతారని భావించారు. నేరుగా వచ్చి.. బాధితుల పక్షాన నిలబడి తన గొంతును వినిపిస్తారని భావించారు. కానీ.. అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. దీంతో.. షర్మిల ఎక్కడ ఉన్నారు? అచ్యుతాపురానికి ఎందుకు రాలేదన్న క్యూరియాసిటీ పలువురిలో కనిపించింది. ఈ నేపథ్యంలో ఆమె ఎక్కడ ఉన్నారు? అన్న ఆరా తీస్తే కొత్త విషయాలు వెలుగు చూశాయి.
ప్రస్తుతం షర్మిల సింగపూర్ లో ఉండటం ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజుల క్రితం సింగపూర్ వెళ్లిన ఆమె.. అక్కడే ఉంటున్నారు. అయితే.. ఈ పర్యటన మొత్తం పూర్తిగా కుటుంబ వ్యవహారంగా చెబుతున్నారు. ఎందుకంటే.. షర్మిల కుమార్తె అంజలిరెడ్డి కాలేజీ ఆడ్మిషన్ కోసం ఆ దేశానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. కాలేజీ ఆడ్మిషన్ సందర్భంగా విద్యార్థితో పాటు.. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆమె కొద్ది రోజులుగా సింగపూర్ లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలాఖరు వరకు సింగపూర్ లోనే షర్మిల ఉంటారని.. ఆ తర్వాత వస్తారని చెబుతున్నారు. సెప్టెంబరు 2న తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కావటంతో.. ఆ రోజున ఆమె ఇడుపులపాయకు చేరుకుంటారని చెబుతున్నారు. దీనికి ఒక రోజు ముందుగా ఇండియాకు చేరుకునే ఆమె.. వర్థంతి వేళ ఇడుపుల పాయలో ఉండనున్నారు.