సాయిరెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్షన్ కోరుతున్న షర్మిల!
అవును.. సెకీ ఒప్పందం విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు.
By: Tupaki Desk | 16 Dec 2024 6:30 PM GMTఏపీ రాజకీయాల్లో అంతెత్తున లేచిన 'సెకీ' ఒప్పందం వ్యవహారంపై ప్రభుత్వం మౌనంగా ఉందా.. లేక, కేంద్రంతో ఈ వ్యవహారంపై చర్యల గురించి చర్చిస్తుందా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో కొనసాగుతోందని అంటున్నారు. అయితే.. ఈ విషయంపై ప్రస్తుతం కూటమి నేతల నుంచి విమర్శలు తగ్గాయనే చర్చ తెరపైకి వచ్చిందని చెబుతున్నారు.
మరోపక్క... విజయసాయిరెడ్డి సెకీ ఒప్పందం గురించి స్పందిస్తూ.. ఆ ఒప్పందం విషయంలో వైఎస్ జగన్ తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో... ఈ విషయం హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి వ్యాఖ్యలను కోట్ చేస్తూ షర్మిల స్పందించారు.
అవును.. సెకీ ఒప్పందం విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ఇందులో భాగంగా... ‘జగన్ తప్పు చేస్తే.. సెకీ ఒప్పందని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటున్న వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు ఏమంటారు చంద్రబాబు’ అంటూ ప్రశ్నించారు షర్మిల.
ఈ సందర్భంగా చంద్రబాబుకు పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ఇందులో భాగంగా.. మౌనంగా ఉంటున్నారు అంటే అదానీతో జగన్ సర్కార్ చేసుకున్న ఒప్పందం అక్రమం కాదని ఒప్పుకున్నారా..? అంటు మొదలు పెట్టిన షర్మిల.. సక్రమం అయినందువల్లే రద్దు చేయలేదని చెప్పకనే చెప్తున్నారా..? అంటూ కొనసాగింపు క్వశ్చన్ వేశారు.
ఇదే సమయంలో... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ వ్యవహారంపై చేసిన విమర్శల్లో రాజకీయమే తప్ప.. మీ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదంటారా..?.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కూడా తూచ్ కిందనేనా..?.. అని ప్రశ్నించిన షర్మిళ... జగన్ నే కాదు అదానీ మిమ్మల్ని కూడా కొన్నారని చెప్తారా..? అంటూ సంచలన ప్రశ్నలు సంధించారు.
దీనికి కొనసాగింపుగా.. అదానీ నుంచి ముడుపులు జగన్ కేనా.. మాకూ అందాయనే నిజం అంగీకరిస్తున్నారా..?.. అందుకే ఏసీబీని పంజరంలో బంధించారా..?.. అందుకేనా అదానీపై ఒక్కమాట కూడా లేదు..?.. ఇదే నా బాబూ మీ 40 ఏళ్ల రాజకీయం..? అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా... రూ.1,750 కోట్లు లంచాలు తీసుకుంటే.. రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.1.50 లక్షల కోట్ల భారం వేసి, అదానీకి మేలూ చేసే మీరు మౌనంగా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉద్యమాన్ని ఆపదంటూ షర్మిల చెప్పుకొచ్చారు.
కాగా... అటు పార్లమెంట్ లోనూ అదానీ వ్యవహారంపై చర్చకు కాంగ్రెస్, విపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఉభయ సభలూ వాయిదాలు పడుతూ వచ్చాయి! ఈ నేపథ్యంలో అదే అదానీతో పాటు ఏపీ గత ప్రభుత్వంపైనా విమర్శలు వచ్చాయని చెబుతున్న వేళ.. చంద్రబాబు నుంచి రియాక్షన్ ఆశిస్తున్నారు షర్మిల!