Begin typing your search above and press return to search.

కూటమికి పెద్ద పరీక్షే పెట్టిన షర్మిల... బాబు ఒప్పుకుంటారా?

ఈ సమయంలో ఏపీలో అధికారంలోని ఎన్డీయే కూటమి సీఎం చంద్రబాబుకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు.

By:  Tupaki Desk   |   25 Nov 2024 2:04 PM GMT
కూటమికి పెద్ద పరీక్షే పెట్టిన  షర్మిల... బాబు ఒప్పుకుంటారా?
X

అదానీపై అమెరికాలో తీవ్ర అభియోగాలు మోపబడిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ఏపీలో రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారు / ఇవ్వజూపారు అనే ఆరోపణలు సంచలనంగా మారాయి! ఈ నేపథ్యలో అదానీ కంపెనీలను ఏపీలో బ్లాక్ లిస్ట్ లో పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు షర్మిల. ఈ నేపథ్యంలో బాబుకు ఓ లేఖ రాశారు. ఇందులో కీలక విషయాలు ప్రస్థావించారు.

అవును... అదానీపై ఎంత పెద్ద ఆరోపణలు వచ్చినా అతనికి ఏమీ కాదని.. అతనిపై విచారణ జరగదని.. అతనిని ప్రధాని నరేంద్ర మోడీ కాపాడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ఇదే సమయంలో "మోదానీ" ఖాతాలో మరో భారీ స్కాం అన్నట్లుగా ఆరోపణలు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఏపీలో అధికారంలోని ఎన్డీయే కూటమి సీఎం చంద్రబాబుకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు.

ఇందులో భాగంగా... అదానీతో జగన్ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం రక్షణం రద్దు చేయాలని.. అక్రమ డీల్ తో 25 ఏళ్లపాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం రూ.1.50 లక్షల కోట్లు అని.. అందువల్ల వెంటనే ఈ డీల్ ను రద్దుచేయాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందంటూ షర్మిల లేఖ రాశారు. ఈ సందర్భంగా.. అదానీకి చెక్ పెడతారా.. లేక, మీరూ అంటకాగుతారా అని కీలక ప్రశ్న సంధించారు.

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతం అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్ పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో లంచాలు తీసుకున్నట్లు ఇప్పటికే అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థలు నిరూపించాయని అన్నారు. దీనివల్ల దేశం, రాష్ట్రం పరువు తీశారని తెలిపారు.

ఇదే సమయంలో... సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.ఈ.సీ.ఐ - సెకీ) ద్వారా అదానీతో గత ప్రభుత్వం 25 ఏళ్లకు ఒప్పందం చేసుకుందని.. 2021 డిసెంబర్ 1న 7వేల మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేసేందుకు ఒప్పందాలు జరిగాయని.. రాష్ట్రంలో రైతుల కోసం ఈ విద్యుత్ ను ఉపయోగించినట్లు ప్రకటించుకున్నారని.. ఇది చౌకగా దక్కించుకున్నట్లు వైసీపీ సర్కార్ విజయంగా చెప్పుకున్నారని అన్నారు.

అయితే.. అదానీ దగ్గర నుంచి అతని సొంత రాష్ట్రం గుజరాత్ రూ.1.99 పైసలకు కొంటుంటే ఏపీ మాత్రం రూ.2.49 పైసలకు అగ్రిమెంట్ చేసుకుందని ఆమె తెలిపారు. ఫలితంగా... అదానీతో జగన్ రూ.1750 కోట్ల లంచాలకు ఆశపడి చేసుకున్న ఒప్పందానికి రాష్ట్రం నెత్తిన పడే భారం రూ.1.50 లక్షల కోట్లని షర్మిల రాసుకొచ్చారు! ఈ నేపథ్యంలోనే ఈ అనుమతులపై దర్యాప్తు జరగాలని షర్మిల డిమాండ్ చేశారు.

అదానికి ఇచ్చిన అర్ధరాత్రి అనుమతుల వెనుక దర్యాప్తు జరగాలని.. ఈ వ్యవహారం మొత్తాన్ని సీఎంవో నుంచే నడిపించారంటూ అప్పటి విద్యుత్ శాఖా మంత్రి (బాలినేని శ్రీనివాస్) ఒప్పుకున్నారని షర్మిల తెలిపారు. దీని వెనుకున్న నిజా నిజాలు ఏమిటో రాష్ట్ర ప్రజలు తెలియాలని షర్మిల కోరారు. అంతకంటే ముందు.. ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే... సొంత ప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని దోచుకోవాలని చూసిన అదానీ గ్రూప్స్ కి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అర్హత లేదని.. అదానీ కంపెనీలను రాష్ట్రంలో పూర్తిగా బ్లాక్ లిస్ట్ కంపెనీగా పరిగణించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల తెలిపారు. అమెరికా దర్యాప్తు సంస్థల ద్వారా అసలు విషయం బయటపడ్డాక కూడా ఆ కంపెనీతోనూ మీరూ ముందుకు వెళ్తారా లేదా అనేది తేల్చుకోవాలని సూటిగా సూచించారు.

దీంతో... అదానీని ఏపీలో బ్లాక్ చేసే పరిస్థితి ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ఉంటుందా? ఒకవేళ అలా జరిగితే అది చాలా గొప్ప విషయమే! కానీ... ఈ ప్రభుత్వం ఆ పని చేస్తుందా..? అలా కాకుండా అదానీ ప్రాజెక్టును కంటిన్యూ చేస్తుందా..? కంటిన్యూ చేస్తే జగన్ చేసిన పని కరెక్ట్ అని ఒప్పుకున్నట్లే అవుతుందా..? ఇన్ని ప్రశ్నల వేళ కూటమి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి!