జగన్ కామెంట్స్.. షర్మిల సపోర్ట్
జగన్ కామెంట్స్‌ను సపోర్ట్ చేసేలా షర్మిల మాటలుండటం హాట్ టాపిక్ అయింది.
By: Tupaki Desk | 11 July 2024 5:34 PM GMTఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పని చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన అన్న జగన్ ప్రభుత్వం వైఫల్యాలను, వైఎస్ వివేకా హత్యపై జగన్ మౌనాన్ని ప్రశ్నిస్తూ షర్మిల సాగారు. జగన్, షర్మిల పరస్పరం కౌంటర్లు వేసుకుంటూ, విమర్శలు చేసుకున్నారు. కానీ కొన్నేళ్ల తర్వాత తొలిసారి ఈ అన్నాచెల్లి ఒకే రకమైన మాటలు మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. జగన్ కామెంట్స్‌ను సపోర్ట్ చేసేలా షర్మిల మాటలుండటం హాట్ టాపిక్ అయింది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఏపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని డెక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన కథనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక రేపింది. వైసీపీ ప్రోద్భలంతోనే ఆ పత్రిక ఈ తరహా కథనాన్ని ప్రచురించిందని, ఇది వైసీపీ కుట్ర అని, విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజీ చేసేందుకు ఇలా చేశారని మంత్రి లోకేశ్ ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై మాజీ సీఎం జగన్ రియాక్టయ్యారు. ఈ దాడిని ఖండించారు. ఇప్పుడు షర్మిల కూడా అన్న బాటలోనే ఈ దాడిని ఖండించారు. జగన్ అభిప్రాయంతో ఆమె ఏకీభవించడం గమనార్హం.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేక ఎదురు చర్యలా? అని షర్మిల ప్రశ్నించారు. దమ్ముంటే మోడీని నిలదీయాలని, నిలదీసే గొంతులపై ఉక్కు పాదం మోపొద్దన్నారు. ఇలాంటి దాడులను ప్రజాస్వామ్యం కోసం పాటుపడే పార్టీగా కాంగ్రెస్ కచ్చితంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో జగన్, షర్మిల ఒక ఇష్యూపై ఒకేలా స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఓ పత్రికా కార్యాలయంపై దాడిని ఎవరైనా ఖండిస్తారు కాబట్టి ఇందులో జగన్, షర్మిల మాటలను ముడి పెట్టి చూడాల్సిన అవసరం లేదనే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ఎన్నికలకు ముందు మాటల యుద్ధం చేసిన అన్నాచెల్లి ఇప్పుడు ఒకే మాట మాట్లాడటం మాత్రం కాస్త విచిత్రంగానే కనిపిస్తోందని చెప్పాలి.