ఆర్కేపై స్పందిస్తూ కూడా జగన్ ని వదలని షర్మిల!
అవును... ఇటీవల కాలంలో ఎమ్మెల్యే పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
By: Tupaki Desk | 23 Feb 2024 12:26 PM GMTసమయం ఏదైనా.. సందర్భం మరేదైనా.. మైకందుకుని మాట్లాడే అవకాశం వస్తే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైనా, వైఎస్సార్సీపీ పైనా షర్మిళ తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నిసార్లు నిప్పులు కక్కుతూ విమర్శలు చేయగా.. కొన్నిసార్లు నవ్వుతూ నవ్వుతూ వేసేస్తుంటారు! ఈ క్రమంలో తాజాగా ఆర్కే గురించి స్పందించిన షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... ఇటీవల కాలంలో ఎమ్మెల్యే పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. అనంతరం షర్మిళతోనే తన ప్రయాణం అని ప్రకటించిన సంగతి తెలిసిందే! ఆ సమయంలో షర్మిళ.. ఆర్కేకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. కట్ చేస్తే తాజాగా ఆర్కే... జగన్ ను కలిశారు! మంగళగిరిలో మరోసారి వైసీపీ జెండా ఎగురుతుందని చెప్పారు!!
దీంతో ఈ విషయాలపై వైఎస్ షర్మిళ స్పందించారు. ఇందులో భాగంగా... ఆర్కే అన్నతో తనకు ఉన్న అనుబంధం వేరని.. ఆయన తనకు చాలా దగ్గరి మనిషని అన్నారు. ఆర్కే కు, తనకు మధ్య రాజకీయాలు లేవని తెలిపారు. ఇదే సమయంలో ఆర్కే ఎక్కడున్నా సంతోషంగా, సమాధానంగా ఉండాలని షర్మిల ఆకాంక్షించారు.
అక్కడితో అయిపోతే ఇక షర్మిళ గొప్పతనం ఏముంది...? అటు తిరిగి ఇటు తిరిగి ఆ వ్యవహారాన్ని కూడా జగన్ పై నెగిటివ్ గా రుద్దే ప్రయత్నం చేయాలని భావించారో ఏమో కానీ... "ఆళ్లపై ఉన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఆయన చెల్లిగా ఆ విషయం నేను అర్థం చేసుకోగలను. ఒక మంచి వ్యక్తి.. రాంగ్ ప్లేస్ లో ఉన్నారు" అని వ్యాఖ్యానించారు.
ఈ సెటైర్ల సంగతి కాసేపు పక్కనపెడితే... మామూలుగా తనకు నచ్చని విషయంపై నిప్పులు చెరిగే అలవాటు కలిగి ఉన్నారనే పేరున్న షర్మిళ.. నెల రోజులు కూడా పూర్తికాకుండానే అన్నట్లుగా.. ఆర్కే తనవద్ద నుంచి వెళ్లిపోవడంపై సీరియస్ గా స్పందిస్తారని చాలా మంది భావించారు!
కానీ... వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆర్కే విషయంలో షర్మిళ చాలా హుందాగా రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా ఆళ్ల పరిస్థితిని అర్థం చేసుకోగలనంటూ స్పందించారు. ఈ సమయంలో కూడా "రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ప్లేస్" అంటూ ఒక రాయి మాత్రం వేసి వదిలారు!!