Begin typing your search above and press return to search.

ఇంకా డోలాయమానంలోనే షర్మిల!

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిక ఇంకా అనిశ్చితిలోనే కొనసాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాలు సెప్టెంబర్‌ 16, 17 తేదీల్లో పూర్తయ్యాయి.

By:  Tupaki Desk   |   18 Sep 2023 1:46 PM GMT
ఇంకా డోలాయమానంలోనే షర్మిల!
X

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిక ఇంకా అనిశ్చితిలోనే కొనసాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాలు సెప్టెంబర్‌ 16, 17 తేదీల్లో పూర్తయ్యాయి. తుక్కుగూడలో ఆ పార్టీ భారీ బహిరంగ సభను సైతం నిర్వహించింది. ఈ క్రమంలోనే షర్మిల కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకు అతీగతీ లేదు.

మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు పలువురు కాంగ్రెస్‌ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా చేరారు. వీరిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, యన్నం శ్రీనివాసరెడ్డి, నల్గొండ జిల్లా నేత జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

ఇటీవల మరణించిన విప్లవ వీరుడు గద్దర్‌ కుటుంబ సభ్యులతోనూ సోనియా గాంధీ సమావేశమయ్యారు. మరోవైపు పార్టీ విలీనం కోసమంటూ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలని కలిసి వచ్చారు.. షర్మిల. ఈ క్రమంలో ఆమె ఇప్పటికే పార్టీలో చేరి ఉండాలి. అయితే చేరలేదు. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ను షర్మిల కలిసి వచ్చారు. ఆయన ద్వారా కాంగ్రెస్‌ లో చేరికకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

అయితే షర్మిల చేరికకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అంగీకరించడం లేదని టాక్‌ నడుస్తోంది. ఆమె సేవలను తెలంగాణలో కాకుండా ఆందప్రదేశ్‌ లో వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానానికి సూచించినట్టు తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణలో షర్మిల ఆశిస్తున్న పాలేరు అసెంబ్లీ సీటు కూడా ఆమెకు ఇచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది. తాజాగా పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావుకు లేదా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిల్లో ఒకరు పాలేరు నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే వీలుంది.

ఈ నేపథ్యంలో షర్మిలను ఎవరూ పట్టించుకోవడం లేదు. సీడబ్ల్యూసీ సమావేశాలు ముగియడం, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు హామీలను అమలు చేస్తామని సోనియా గాంధీ ప్రకటించడంతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు తమ ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. ఈ నేపథ్యంలో షర్మిలను అంతా లైట్‌ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. తుక్కుగూడ బహిరంగ సభలోనూ షర్మిల కనిపించలేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి ఆమెకు ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది. పాలేరు అసెంబ్లీ సీటుపై హామీ రావడంతో తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో చేరగా, షర్మిలకు మాత్రం ఆ హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.

తెలంగాణలో పార్టీలో చేరాలని ఆమె చేసిన అభ్యర్థనను కాంగ్రెస్‌ తిరస్కరించిందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఇక షర్మిల ప్రస్థానం తెలంగాణ రాజకీయాల్లో శూన్యమేనని అంటున్నారు.