నమ్మకమే అసలు సమస్య.. షర్మిల 'రాజకీయం' ..!
తాము కోల్పోయిన ఓటు బ్యాంకు సహా పాత కాపులు కూడా తమకు తిరిగి వస్తారని.. తమ పార్టీకి జై కొడతారని పార్టీ ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అయితే.. ఇది సాధ్యమయ్యేనా? అనేది ప్రధాన ప్రశ్న.
By: Tupaki Desk | 6 Jan 2024 2:30 AM GMTఏపీలో రాజకీయాలు చేసేందుకు సై అంటున్న వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ.. వైఎస్ షర్మిల విషయంపై జోరుగానే చర్చ లు సాగుతున్నాయి. వాస్తవానికి షర్మిల ఎంట్రీతో ఏపీలో అద్భుతాలు జరుగుతాయని.. కాంగ్రెస్ పార్టీ భారీగానే ఆశలు పెట్టుకుంది. తాము కోల్పోయిన ఓటు బ్యాంకు సహా పాత కాపులు కూడా తమకు తిరిగి వస్తారని.. తమ పార్టీకి జై కొడతారని పార్టీ ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అయితే.. ఇది సాధ్యమయ్యేనా? అనేది ప్రధాన ప్రశ్న.
ఎందుకంటే.. నమ్మకమే ఇప్పుడు అసలు సమస్యగా మారిందనేది మెజారిటీ నేతల మాట. తాను సొంతగా పార్టీ పెట్టుకుని వేరు కుంపటితో తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్లిన షర్మిల.. ఏపీతో పోరాడేందుకు తాను సిద్ధమని అప్పట్లోనే తేల్చి చెప్పారు. "తెలంగాణ హక్కుల కోసం.. నీటి కోసం.. ఇక్కడి వారి అభివృద్ది కోసం ఏపీతో కొట్లాడేందుకు నేను సిద్ధం" అంటూ షర్మిల అప్పట్లో సుదీర్ఘ ఉపన్యాసాలు చేశారు. అదేసమయంలో తాను తెలంగాణ వరకే పరిమితం అవుతానని కూడా చెప్పారు.
ఇక, తెలంగాణలో పాదయాత్ర కూడా చేసిన షర్మిల అక్కడే తన రాజకీయాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇలాంటి నాయకురాలు.. అక్కడ విఫలమై.. పార్టీని ఏకంగా కాంగ్రెస్‌లో విలీనం చేయడం దరిమిలా.. ఆమె విశ్వసనీయతపై అనేక సందేహాలు వస్తున్నాయి. గతంలో విజయశాంతి కూడా ఇలానే చేశారనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది. విజయ శాంతి కూడా సొంత కుంపటి పెట్టుకుని..తర్వాత బీఆర్ఎస్‌లో విలీనం చేయడం.. అక్కడ కూడా ఇమడలేక.. బయటకు వచ్చి కాంగ్రెస్, బీజేపీ అంటూ కూనిరాగాలు తీయడం తెలిసిందే.
దీంతో విజయశాంతిపై రాజకీయంగా విశ్వసనీయత సన్నగిల్లింది. ఆమె తర్వాత.. అచ్చం అలానే ఇప్పు డు షర్మిల రాజకీయాలు కూడా సాగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. దీనిని గాడిలో పెట్టడం.. పాతకాపులను తిరిగి పార్టీ బాట పట్టించడం అనేది సాధ్యం కాదనే చర్చ నడుస్తోంది. దీనికి ప్రధానంగా షర్మిల విశ్వసనీయతే సమస్యగా మారిందనేది చర్చల్లో ప్రధానంగా వినిపిస్తున్న టాక్. మొత్తానికి ఇప్పుడు షర్మిలకు నమ్మకమే ప్రధాన సమస్యగా మారిపోయింది. మరి ఆమె ఏం చేస్తారో చూడాలి.