ఏపీ సీఎం అభ్యర్థిగా షర్మిల!
అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహం మరోలా ఉందని అంటున్నారు. షర్మిల ను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనేది వ్యూహమని చెబుతున్నారు.
By: Tupaki Desk | 3 Aug 2023 9:45 AM GMTతెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణ వైఎస్సార్ పార్టీ ఏర్పాటు చేశారు.. దివంగత సీఎం వైఎస్సార్ కుమార్తె.. షర్మిల. అయితే షర్మిల పార్టీని అక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అత్యంత బలంగా ఉన్నాయి. వీటికి తోడు తాను ఉన్నానంటూ బీజేపీ కూడా అడపదడపా ఉనికి చాటుకుంటోంది. ఇంకా చిన్నాచితక పార్టీలు ఎలాగూ ఉన్నాయి.
రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణలో కాలికి బలపం కట్టుకుని పాదయాత్ర చేశారు.. షర్మిల. అయితే ఇన్ని పార్టీల మధ్య ఆ పార్టీని ఎవరూ పట్టించుకోలేదు. దాదాపు రాష్ట్రమంతా పాదయాత్ర చేసినా ఒక్కరంటే ఒక్క పేరున్న నేత కూడా ఆ పార్టీలో చేరలేదు. దీంతో షర్మిల కూడా రూటు మార్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవగానే ఆ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలసి వచ్చారు. కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికే షర్మిల.. డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి.
ఎట్టకేలకు కాంగ్రెస్ లో షర్మిల చేరికకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఆమె రాకను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా స్వాగతిస్తున్నారు. కాగా షర్మిల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లేదా క్రైస్తవులు ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయొచ్చని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహం మరోలా ఉందని అంటున్నారు. షర్మిల ను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనేది వ్యూహమని చెబుతున్నారు. ఏపీ లో షర్మిలతో పాదయాత్ర చేయించి తమకు దూరమైన ఎస్సీ, మైనారిటీ, ఎస్టీ వర్గాల ను, కొంతమేరకు రెడ్డి సామాజికవర్గాన్ని తమ వైపునకు తిప్పుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహమని పేర్కొంటున్నారు.
తద్వారా ముల్లుతోనే ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు.. కాంగ్రెస్ ను దెబ్బతీసి తమ ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకున్న జగన్ కు షాక్ ఇవ్వాలనేదే కాంగ్రెస్ అధిష్టానం వ్యూహమని చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నాయి. ఈ సామాజికవర్గాల్లో అత్యధికులు వైసీపీ తోనే ఉన్నారని టాక్. గతంలో వీరంతా కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉండేవారు. ఈ నేపథ్యంలో షర్మిల ను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఏపీ లో ఆమెతో పాదయాత్ర చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు.
షర్మిల పాదయాత్ర ద్వారా తమకు దూరమైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు మళ్లీ తమకు చేరువ అవుతాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి షర్మిల ఇందుకు అంగీకరిస్తారా? లేదా అనేది వేచిచూడాల్సిందే.