Begin typing your search above and press return to search.

షర్మిల గెలుపునకు ఆ ఓటింగ్ విధానమే అడ్డు వస్తోందా ?

అదే సమయంలో వైఎస్ షర్మిలకు ఈసారి ఏపీలో కడప లోక్ సభ నుంచి పోటీ చేయడం తొలి ప్రయత్నం.

By:  Tupaki Desk   |   29 May 2024 1:05 PM GMT
షర్మిల గెలుపునకు ఆ ఓటింగ్ విధానమే  అడ్డు వస్తోందా ?
X

ఏపీలో ఈసారి జరిగిన ఎన్నికల్లో అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. చట్ట సభలలో అడుగుపెడదామని ముగ్గురు కీలక నేతలు ఈసారి గట్టి ప్రయత్నం చేశారు. వారిలో ఇద్దరు గతంలో పోటీ చేసి ఓడారు. వారిది రెండవ ప్రయత్నం. అదే సమయంలో వైఎస్ షర్మిలకు ఈసారి ఏపీలో కడప లోక్ సభ నుంచి పోటీ చేయడం తొలి ప్రయత్నం.

ఇక పవన్ కళ్యాణ్, నారా లోకేష్ రెండవ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ ముగ్గురూ ఈసారి గెలుస్తారా లేదా అన్న అంశం మాత్రం చర్చనీయాంశంగా ఉంది. వీరి మీద సోషల్ మీడియాలో వచ్చే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే 2024 లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో షర్మిల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది.

అంతే కాదు కడపలో వైఎస్ రాజారెడ్డి కుటుంబం రెండుగా చీలడం ఈసారి ఎన్నికల్లోనే జరిగింది. షర్మిల సునీత జగన్ తో విభేదించి వేరుగా కాంగ్రెస్ తరఫున రంగంలో నిలబడ్డారు. షర్మిల పోటీ చేస్తే సునీత ప్రచారం చేస్తూ మద్దతుగా నిలిచారు.

ఇలా ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం రెండుగా చీలిపోవడం ఈసారి అతి పెద్ద విషయంగానే మారింది. మామూలుగా అయితే వైఎస్సార్ ఉంటే ఎలాంటి సమస్యలు కుటుంబంలో వచ్చినా సర్దుబాటు చేసేవారు అని చెబుతారు.

మరి వైఎస్సార్ వారసత్వాన్ని తీసుకుని వైఎస్సార్ కుటుంబంలో ఇబ్బందులు లేకుండా చూడాల్సిన వేళ ఆ సర్దుబాటు ఎందుకు చేయలేకపోయారు అన్నదే చర్చగా ఉంది. నిజానికి జగన్ అందరికీ కూర్చోబెట్టి సర్దుబాటు చేసి ఉంటే సెట్ అయ్యేది అని అంటున్నారు. అయితే జగన్ అలా చేయడానికి ఇష్టపడలేదని వైఎస్సార్ కుటుంబ సభ్యులే చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది అంటున్నారు.

ఇక ఇటీవల పోలింగ్ అనంతరం చేసిన ఒక సర్వేలో పులివెందులలో ఒక ఓటు జగన్ కి మరో వోటు షర్మిలకు వేశామని చెప్పారని వెల్లడి అయింది. అందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ఒక వేళ ఆ సర్వే కనుక నిజం అయితే మాత్రం షర్మిలకు విజయావకాశాలు కచ్చితంగా ఉంటాయని అంటున్నారు.

అయితే ఎన్నికల ప్రచారం నేపధ్యంలో ఆ మధ్య ఒక ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ తన చెల్లెలుకు కడప ఎంపీ సీటులో డిపాజిట్ వచ్చే అవకాశం లేదని తేల్చేశారు. అలాంటిది జరిగితే తనకు చాలా బాధగా ఉంటుందని కూడా జగన్ చెప్పుకొచ్చారు.

కానీ జగన్ చెప్పిన దానికి భిన్నంగా షర్మిలకు మంచిగానే ఓట్లు పడతాయని సర్వే నివేదికలు చెబుతున్నాయి. అయితే ఓటింగ్ పాటర్న్ ఈసారి మారింది. దాని వల్ల ఇబ్బంది అయింది అని అంటున్నారు. 2019లో ఎన్నికల్లో చూస్తే మొదటి ఓటు ఎమ్మెల్యేకు రెండవ ఓటు ఎంపీకి వేశారు. ఈసారి మాత్రం ఆ పాటర్న్ మారింది. మొదట ఓటు ఎమ్మెల్యేకు రెండవ ఓటు ఎంపీగా మార్చారు.

దాంతోనే ఇపుడు షర్మిలకు ఇబ్బంది అవుతుందా అన్న చర్చ సాగుతోంది. అదెలా అంటే ఈసారి మొదటి ఓటు జగన్ కి వేసిన వారు రెండవ ఓటు ఎంపీకి వేయాలనుకున్నా ఈ పాటర్న్ అర్థం కాకపోవడం వల్ల క్రాస్ ఓటింగ్ జరిగింది అని అంటున్నారు. దాంతో ఎవరికి ఏ ఓటు పడింది అన్నది పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. ఇక 2019 నాటి పాటర్న్ ఉండి ఉంటే షర్మిల కచ్చితంగా గెలిచేది అన్న మాట ఇపుడు వినిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే షర్మిల ఈసారి గెలవాలి అని కోరుకునే వారు ఎక్కువగానే ఉన్నారు అన్నది తెలుస్తోంది.

మరో వైపు టీడీపీ వారు కూడా ఈసారి షర్మిల గెలిస్తే బాగుంటుంది అని అంటున్నారుట. దీంతో షర్మిల మీద బాగానే బెట్టింగులు నడుస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ క్రాస్ ఓటింగ్ అన్నది వైసీపీ వైపు నుంచే కాకుండా టీడీపీ వైపు నుంచి కూడా జరిగింది అని అంటున్నారు. దాంతో షర్మిలకు రెండిందాలా రాజకీయ లాభం జరిగి అనూహ్యంగా గెలుస్తుందా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా కడపలో షర్మిల గెలిస్తే మాత్రం అది అత్యంత సంచలన పరిణామమే కాదు మొత్తం ఏపీ రాజకీయాలు సమూలంగా మారిపోతాయని కూడా చెప్పక తప్పదు అంటున్నారు.