కడప వేదికగా షర్మిల వర్సెస్ భారతి !
కడప రాజకీయం ఈసారి రంజుగా మారనుంది. వైయస్సార్ కుటుంబంలో భారీ చీలిక వచ్చిన నేపధ్యంలో ఈసారి ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి
By: Tupaki Desk | 11 April 2024 8:26 AM GMTకడప రాజకీయం ఈసారి రంజుగా మారనుంది. వైయస్సార్ కుటుంబంలో భారీ చీలిక వచ్చిన నేపధ్యంలో ఈసారి ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. అన్నా చెల్లెళ్ల మధ్య పోరు కాస్తా ముదిరి పాకన పడి ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ కి ఎదురుగా సొంత చెల్లెలు షర్మిల నిలబడ్డారు. ఆమె ఏకంగా కాంగ్రెస్ ఏపీ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు ఆమె కడప ఎంపీగా పోటీ చేయనున్నారు.
ఆమె ఇప్పటికే కడపలో బస్సు యాత్ర చేపట్టి జగన్ మీద ఆయన ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్నే కాదు పులివెందులలో ఆయనను ఎమ్మెల్యే అభ్యర్ధిగా కూడా ఓడించాలని షర్మిల ఇస్తున్న పిలుపు రాజకీయంగా మంట పుట్టిస్తోంది. మరో వైపు చూస్తే వైఎస్ వివేకా హత్య చేసుకుని ముందుకు తెచ్చి జగన్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తోంది షర్మిల.
దాంతో వైఎస్సార్ ఫ్యామిలీ అంటే ప్రాణం పెట్టే కడప జనం ఎటూ తేల్చుకోలేక దిక్కులు చూసే పరిస్థితి ఉన్నదీ. ఈ నేపధ్యంలో ఇపుడు షర్మిలకు కానీ సునీతకు కానీ జగన్ వైపు నుంచి కౌంటర్లు అయితే పెద్దగా పడడం లేదు. జగన్ సైతం తన బస్సు యాత్రలో తన చెల్లెళ్ళు చంద్రబాబు ట్రాప్ లో పడ్డారు అని మాత్రమే అన్నారు. అంతకు మించి కామెంట్స్ చేయలేదు
దీంతో కడప రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ దూకుడుతో వైసీపీ డిఫెన్స్ లో పడిపోతోంది. ఈ లోటుని భర్తీ చేయడానికి వైసీపీలో రాజకీయ దూకుడు పెంచి క్యాడర్ లో జోష్ తీసుకుని రావడానికి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి రంగంలోకి దిగబోతున్నారు అన్న వార్త ఇపుడు వైరల్ గా మారుతోంది. ఆమె పులివెందులలో జగన్ విజయం కోరుతూ ప్రచారం చేస్తారు అని అంటున్నారు.
అంతే కాదు కడప మొత్తం మీద భారతి వైసీపీ తరఫున ప్రచారం చేస్తారు అని అంటున్నారు. అంటే కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తున్నారు ఆమెకు కౌంటర్ గా మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో భారతి ప్రచారం సాగుతుంది అన్న మాట. ఒక విధంగా అదే జరిగితే వదినా మరదళ్ళు రాజకీయంగా కడప వేదికగా ఢీ అంటే ఢీ కొడతారు అన్న మాట.
ఇప్పటిదాక షర్మిల కానీ సునీత కానీ జగన్ మీద చేసిన విమర్శలకు వైసీపీ నుంచి కౌంటర్లు అయితే పెద్దగా లేవు మరి భారతి తన మరదలు ప్రశ్నలకు విమర్శలకు ధీటైన జవాబు చెబుతారా అన్నది ఆసక్తికరంగా ఉంది. మరో వైపు చూస్తే వైఎస్ జగన్ ఈ నెల 22న పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేస్తారు అని అంటున్నారు. ఆయన బస్సు యాత్ర ఈ నెల 21తో ముగుస్తుంది అని అంటున్నారు.
ఆ తరువాత ఆయన నామినేషన్ దాఖలు చేసి మరోసారి ఏపీ మొత్తాన్ని హెలికాప్టర్ ద్వారా తిరుగుతారు అని రోజుకు మూడు బహిరంగ సభలలో ప్రసంగిస్తారు అని అంటున్నారు. ఇక జగన్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి పులివెందులలో భారతి ప్రచార బాధ్యతలు చూస్తారు అని అంటున్నారు. ఆమె 2019 ఎన్నికల్లోనూ జగన్ తరఫున ప్రచారాన్ని చేపట్టారు.
అయితే అప్పటి పరిస్థితులు వేరు. ఈసారి మాత్రం అంతా మారిపోయింది. సొంత చెల్లెలు వైరి పక్షంలో చేరి సవాల్ చేస్తున్నారు. పైగా మొదటిసారి షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. కడప గడ్డ అంటే వైఎస్సార్ కుటుంబం అడ్డాగా చెబుతారు. ఇపుడు ఆ కుటుంబం రెండుగా చీలిన వేళ జనాల మద్దతు ఎవరికి ఉంటుంది అన్నది చర్చగా ఉంది. అదే సమయంలో షర్మిల అటు వైపు ఉంటే ఇటువైపు భారతి ఉంటే ఈ ఇద్దరు నారీమణుల నడుమ రాజకీయ విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయన్న చర్చ కూడా సాగుతోంది.
అయితే భారతి మాత్రం విమర్శల జోలికి పోకుండా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన విజయాలను ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల గురించే జనాలలో ఎక్కువగా ప్రచారం చేస్తారు అని అంటున్నారు. అయితే తన వదిన ప్రచారం స్టార్ట్ చేస్తే ఎదురుగా నిలిస్తే షర్మిల ఊరుకుంటారా ఆమె ఆ వైపు నుంచి సవాల్ చేస్తే భారతి కచ్చితంగా జవాబు చెప్పాల్సిందే కదా అంటున్నారు. మొత్తానికి ఈసారి కడపలో వదినా మరదళ్ల సవాల్ అని అంతా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.