Begin typing your search above and press return to search.

జగన్ దూకుడుకు షర్మిల బ్రేకులు ?

అందుకే తెలంగాణాలో పార్టీ పెట్టినా ఆమె ఏపీకి ఎన్నికల వేళ షిఫ్ట్ అయ్యారు.

By:  Tupaki Desk   |   27 July 2024 11:26 AM GMT
జగన్ దూకుడుకు షర్మిల బ్రేకులు  ?
X

వైఎస్ జగన్ కి జాతీయ స్థాయిలో ఏకైక ఆప్షన్ గా ఉన్న ఇండియా కూటమిలోకి ప్రవేశించకుండా సొంత చెల్లెలే అడ్డు పడుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు షర్మిల జగన్ మీద కక్ష కట్టినట్లుగా చేస్తున్న విమర్శలు చూస్తే అదే అర్ధం అవుతోంది. ఆమె ఏపీ రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారు.

అందుకే తెలంగాణాలో పార్టీ పెట్టినా ఆమె ఏపీకి ఎన్నికల వేళ షిఫ్ట్ అయ్యారు. ఆమె రాకతో కాంగ్రెస్ కి ఈ ఎన్నికల్లో పెద్దగా ఒనగూడింది ఏమీ లేకపోయినా వైసీపీని దెబ్బతీసి భవిష్యత్తుకు ఆశను కల్పించారు. షర్మిలను లైట్ తీసుకున్న పాపానికి వైసీపీ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ముఖ్యంగా వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న రాయలసీమలో షర్మిల ఫ్యాక్టర్ బాగా పనిచేసింది. అందుకే ఘోరాతి ఘోరమైన పరాజయం వైసీపీని వరించింది.

కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానానికి సరిపడ సీట్లు కూడా దక్కలేదు అంటే ఆ పుణ్యం కాంగ్రెస్ కి ఎన్నికల వేళ నాయకత్వం వహించిన షర్మిల వల్లనే అని అంటున్నారు. ఇక ఎన్నికల తరువాత కూడా ఆమెకు భారీ టార్గెట్ ఉంది. వైసీపీని ఎంత మేరకు వీలైతే అంత దెబ్బ తీస్తేనే కాంగ్రెస్ బలోపేతం అవుతుంది. అలా షర్మిలకి కూడా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది.

దాంతోనే ఆమె అధికార కూటమి కంటే కూడా ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే జాతీయ స్థాయిలో మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీతో చెలిమికి తెర వెనక కూడా అవకాశం లేదని భావించిన వైసీపీ అధినాయకత్వం ఇండియా కూటమి వైపు మొగ్గింది. ఢిల్లీలో ధర్నా వెనక వ్యూహాలు అవేనని కూడా అంటున్నారు.

అయితే కాంగ్రెస్ ఈ ధర్నాకు తన ఎంపీలను పంపి ఉంటే వైసీపీ వ్యూహం సక్సెస్ అయ్యేది. కానీ అలా జరగలేదు. మిత్రులు వచ్చారు, కానీ ఇండియా కూటమికి పెద్దన్న లాంటి కాంగ్రెస్ మాత్రం రాలేదు. దాని వెనక శక్తులు చాలానే ఉన్నాయని జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన ఆరోపణల వల్ల అర్థం చేసుకోవాలి.

ఇదిలా ఉంటే జగన్ ఇండియా కూటమిలో చేరితే డైరెక్ట్ గా చంద్రబాబుకు ఇండైరెక్ట్ గా షర్మిలకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. చంద్రబాబుకు ఈ రోజున ఎన్డీయేలో ముఖ్య స్థానం ఉన్నా రాజకీయాలు ఎపుడు ఎలా ఉంటాయో తెలియదు అని అంటున్నారు. ఇండియా కూటమి పొలిటికల్ గ్రాఫ్ బాగా పెరిగిన క్రమంలో 2029 నాటికి టీడీపీ పొలిటికల్ స్టాండ్ కూడా మారవచ్చు అని అంటున్నారు. మరి అప్పటికి ఇండియా కూటమిలో ఏపీకి సంబంధించి పొలిటికల్ స్లాట్ అలా ఖాళీగా ఉండాలంటే జగన్ అందులోకి చేరకూడదు అన్న ఎత్తుగడలు ఉంటాయని అంటున్నారు.

అందుకే జగన్ కూడా చంద్రబాబు రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పెద్దలతో రిలేషన్స్ కొనసాగిస్తున్నారు అని ఆరోపణలు చేశారు. ఇక కాంగ్రెస్ ఉన్న ఇండియా కూటమిలో చేరితే ఏపీలో వైసీపీ బలోపేతం అవుతుంది. 2029 నాటికి పొత్తులు పెట్టుకుంటే జగన్ కే అది అడ్వాంటేజ్. దాంతో పాటు పీసీసీ చీఫ్ గా షర్మిల ప్రాధాన్యత తగ్గిపోతుంది అని అంటున్నారు. అంతే కాదు వైసీపీ ఇండియా కూటమిలో చేరితే మిత్రపక్షం అవుతుంది కాబట్టి వైసీపీని టార్గెట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, అపుడు షర్మిలతో కూడా పని ఉండదు, అలా ఆమె రాజకీయం కూడా కొంత ఇబ్బందులో పడుతుంది.

దాంతో ఆమె ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఇండియా కూటమి వైపు వెళ్ళకుండా తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. తాజాగా ఆమె చేసిన ట్వీట్ లో కూడా బీజేపీతో వైసీపీ అక్రమ పొత్తులు అని వ్యాఖ్యానించడం ద్వారా కాంగ్రెస్ కి గతాన్ని గుర్తు చేశారు అని అంటున్నారు. అలాగే మణిపూర్ అల్లర్ల మీద వైసీపీ రియాక్ట్ కాలేదని ఆమె ఎత్తి చూపారు.

ఏపీలో జగన్ రాజకీయ అవసరాల కోసమే ధర్నాను చేశారని ఆమె ఘాటు విమర్శలు చేశారు. ఈ విధంగా ఆమె చెప్పడం ద్వారా కాంగ్రెస్ ని అలెర్ట్ చేశారు అని అంటున్నారు. భవిష్యత్తులో జగన్ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి వైపు రాకుండా షర్మిల బ్రేకులు వేస్తున్నారు అని అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ వద్ద ఉన్న తరుణోపాయం ఏమిటో చూడాల్సిందే. ఇండియా కూటమిలో ఏ పార్టీ చేరాలన్నా కాంగ్రెస్ అనుమతి అవసరం. ఆ పార్టీ దయతలిస్తేనే చోటు దక్కుతుంది. సో వైసీపీ ఇపుడు ఏమి చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.