Begin typing your search above and press return to search.

గిడుగు పదవి మీద పిడుగు.. షర్మిలదే కాంగ్రెస్...!

ఏపీ కాంగ్రెస్ పదవికి ఎపుడూ పోటీ లేదు. విభజన తరువాత ఆ పదవి తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం రాజకీయ విషాదం.

By:  Tupaki Desk   |   15 Jan 2024 11:07 AM GMT
గిడుగు పదవి మీద పిడుగు.. షర్మిలదే కాంగ్రెస్...!
X

ఏపీ కాంగ్రెస్ పదవికి ఎపుడూ పోటీ లేదు. విభజన తరువాత ఆ పదవి తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం రాజకీయ విషాదం. మొదట్లో రఘువీరారెడ్డి చేసినా ఆయన ఆ తరువాత కాంగ్రెస్ బండి లాగలేనట్లు రాజీనామా చేశారు. ఆయన తరువాత అదే అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సాకె శైలజానాధ్ కొన్నాళ్ళ పాటు కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు.

ఆ మధ్య చేసిన మార్పులలో గోదావరి జిల్లాలకు చెందిన గిడుగు రుద్రరాజుకు అనూహ్యంగా ఆ పదవి దక్కింది. ఇక గిడుగు పార్టీని ఎలా నడిపారు అన్న దాని కంటే ఆయన మీడియాలో ఎపుడూ కనిపిస్తూ స్టేట్మెంట్స్ ఇస్తూ కాంగ్రెస్ గురించి చేయాల్సిన ప్రచారం చేశారు. ఏపీలో కాంగ్రెస్ ని ఎవరూ లేపలేనంతగా పాతాళం అంచులకు చేరిన నేపధ్యం ఉంది.

ఇపుడు వైఎస్సార్ కుమార్తె ఆ పదవిని స్వీకరించబోతున్నారు అని టాక్ నడుస్తోంది. అందుకే గిడుగు పదవి మీద పిడుగు పడింది. సంక్రాంతి పండుగ వేళ ఆయన మాజీ పీసీసీ చీఫ్ అయిపోయారు. తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గెకు ఆయన పంపించేశారు.

అలా వైఎస్ షర్మిల రాకకు ఖాళీ చేసి పెట్టారు. ఇక హై కమాండ్ స్టేట్మెంట్ తరువాయి ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా వైఎస్ షర్మిల ఆ పార్టీ పగ్గాలు అందుకుంటారు అన్న మాట. ఎన్నికలకు గట్టిగా తొంబై రోజులు కూడా లేని వేళ షర్మిల ఏపీ కాంగ్రెస్ ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారు అన్నది చూడాలి

కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎలా ముందుకు సాగుతుంది అన్నది అందరికీ ఆశ్చర్యమే. ఎందుకంటే బాగులేని సినిమాకు టికెట్ దండుగ అని జనాలు సినిమాలు చూసే సీన్ లేని రోజులు ఇవి. అంటే ఆడియన్స్ మనసు ఓడె గుర్రం మీద ఉండదని దాని అర్ధం. అలా ఓటర్లు ఎపుడూ గెలుపు పార్టీల వైపే ఉంటారు.

ఏపీలో అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం కూటమి ఢీ కొడుతున్న వేళ మధ్యలో కాంగ్రెస్ ఏమి అద్భుతాలు సాధిస్తుంది అన్నది ఎవరికీ అర్ధం కాని విషయమే. నిజం చెప్పాలంటే ఇపుడు కాంగ్రెస్ కి దిగ్గజ నేతలు ఎవరు వచ్చినా బతికించడం కష్టం అన్న భావన ఉంది. అయితే షర్మిలను ముందు పెట్టి ఎంతో కొంత ఉనికి చాటుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేస్తోంది.

మొత్తానికి కాంగ్రెస్ పదవికి చాన్నాళ్లకు కొంత పోటీ అయితే ఏర్పడింది. ఒకరి కోసం మరొకరిని రాజీనామా చేయిస్తున్నారు అంటే కాంగ్రెస్ పెద్దలకు చాలా ఆశలు ఏపీ మీద ఉన్నాయి. కానీ జనాల భావాలు అర్ధం అయ్యేసరికి ఎవరు ఏమిటి అన్నది క్లియర్ పిక్చర్ వస్తుంది అని అంటున్నారు.