హ్యాండ్ ఇచ్చిన ఆళ్లపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో తిరిగి వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారి స్పందించారు.
By: Tupaki Desk | 23 Feb 2024 7:59 AM GMTతనకు మంగళగిరి సీటు ఇవ్వలేదని అలిగి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తిరిగి కొద్ది రోజుల క్రితం మళ్లీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. మంగళగిరిలో జగన్ ఎవరికి సీటు ఇచ్చినా గెలిపిస్తానని.. మరో 30 ఏళ్లు సీఎంగా జగనే ఉండాలని ఆర్కే హాట్ కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలో తిరిగి వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. ఆర్కేపై ఉన్న ఒత్తిడి.. అంతా ఇంతా కాదన్నారు. చాలా ఒత్తిడి చేయడంతోనే ఆయన తిరిగి వైసీపీలో చేరారన్నారు. ఆయన మంచి వ్యక్తి అని.. అయితే రాంగ్ ప్లేస్ లో ఉన్నారని షర్మిల హాట్ కామెంట్స్ చేశారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు అన్నలాంటి వ్యక్తన్నారు. ఆయన పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను తాను ఏమనగలనని ప్రశ్నించారు. రామకృష్ణకు, తనకు రాజకీయాలు లేవన్నారు. తన మనసుకు దగ్గరయిన వ్యక్తి ఆయన అని వెల్లడించారు. రాజకీయ కారణాలు లేకపోతేనే వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సి ఉంటుందన్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలని చెప్పే అవసరం తనకు లేదని తెలిపారు.
కాగా.. ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ లో చేరిన రెండు నెలలకే తిరిగి వైసీపీలో చేరిపోయారు. ఆళ్ల సోదరుడు, రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ ను కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నెల రోజులకే ఆళ్ల తిరిగి సొంతగూటికి చేరడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
వైసీపీలో చేరిన అనంతరం పార్టీలో చేరిన అనంతరం ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతున్నట్టు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకి చెప్పలేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి జగన్ ను ఓడించాలని చూస్తున్నాయని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఓసీ చేతిలో మంగళగిరిలో ఓడిన నారా లోకేశ్ వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలవుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం లేదన్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఆర్కేపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆయనపై వైసీపీ నేతలు చాలా ఒత్తిడి పెట్టడం వల్లే ఆర్కే పార్టీ మారారని.. లేదంటే కాంగ్రెస్ లోనే ఉండేవారని చెప్పడమే షర్మిల ఉద్దేశమని అంటున్నారు. షర్మిల వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్కే ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.