బీజేపీని బదనాం చేస్తున్న షర్మిల...టీడీపీ కూటమితో కాంగ్రెస్...!?
అంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోందా అంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రసంగాలు చూస్తే అదే బోధపడుతోంది.
By: Tupaki Desk | 24 Jan 2024 11:30 PM GMTఅంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోందా అంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రసంగాలు చూస్తే అదే బోధపడుతోంది. ఏపీలో ఎన్నికల వేళ కొత్త కూటములు కొలువు తీరనున్నాయా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏపీకి బీజేపీ శాపం అని ఆమె చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ ప్రజలను బీజేపీకి బానిసలుగా చేయడానికి రాజకీయ పార్టీలు అన్నీ చూస్తున్నాయని ఆమె ఆరోపిస్తున్నారు.
కొన్ని తెర వెనక కొన్ని తెర ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని ఆమె అంటున్నారు. వైసీపీ బీజేపీల మధ్య కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఆమె జగన్ మీద నేరుగానే బాణాలు వేస్తున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం గంగవరం పోర్టుని అదానికి కారు చౌకగా ఏపీ ప్రభుత్వం కట్టబెట్టింది అని ఆమె ప్రశ్నించడం వైసీపీ ప్రభుత్వానికి ఇరకాటం లాంటిదే.
విశాఖ స్టీల్ ప్లాంట్ ని బీజేపీ సర్వనాశనం చేస్తున్నా వైసీపీ నోరు మెదపడంలెదని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మెడలు వంచైనా తెస్తామని జగన్ అన్న మాటలను ఆమె గుర్తు చేశారు. కేంద్రం మెడలు వంచడం కాదు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క కార్యక్రమం అయినా జగన్ చేశారా అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం నిధులు ఇవ్వడం లేదు, రాజధానికి నిధులు లేవు, ఆఖరుకు స్టీల్ ప్లాంట్ ని కూడా నిండా ముంచేస్తోంది బీజేపీ అని ఆమె మండిపడ్డారు. మతతత్వ బీజేపీ మనకు అవసరమా అని ఆమె నిలదీస్తున్నారు. బీజేపీని దానికి మద్దతు ఇస్తున్న పార్టీలను ఇంటికి పంపించాలని షర్మిల పిలుపు ఇస్తున్నారు.
దీంతో ఏపీలో కాంగ్రెస్ ఆలోచనలు ఏమిటో అర్ధం అవుతున్నాయి. ఇండియా కూటమిలో ఇప్పటికే కమ్యూనిస్టులు ఉన్నారు. ఏపీలో చూస్తే టీడీపీ జనసేన రెండూ పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ ఈ కూటమికి రావాలని చూస్తున్నాయి ఈ పార్టీలు. అయితే పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న షర్మిల బీజేపీని పూర్తిగా బదనాం చేసే పనిలో పడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏపీకి అన్యాయం చేసినట్లే అని ఆమె గట్టిగా చెబుతున్నారు.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు బీజేపీతో పొత్తు వదిలేసి టీడీపీ జనసేన కాంగ్రెస్ వైపు చూస్తాయా అన్నది కూడా చర్చకు వస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే కమ్యూనిస్టులు కూడా ఈ కూటమిలో ఉంటాయి. ఈ కూటమి బలంగా పటిష్టంగా ఉంటుంది. తెర వెనక ఏమి జరుగుతుందో తెలియదు కానీ బీజేపీని షర్మిల తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నారు.
మణిపూర్ రాష్ట్రంలో జరిగిన సంఘటనలను ఆమె ప్రస్తావిస్తున్నారు. మైనారిటీల సహా అంతా హాయిగా ఉండాలంటే దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ తోనే సాధ్యం అని అంటున్నారు. ఏపీలో టీడీపీకి కూడా మైనారిటీ ఓట్లు కావాలి. బీజేపీని తెగ విమర్శిస్తూ షర్మిల జిల్లాల పర్యటనలు చేయడంతో మిగిలిన రాజకీయ పార్టీలు అలెర్ట్ కావాల్సిన పరిస్థితి ఉంది అని అంటున్నారు.
అదే విధంగా ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదు అని ఆమె వివరంగా చెబుతున్నారు. అసలే ఏపీలో బీజేపీ పట్ల జనంలో వ్యతిరేకత ఉంది. కానీ ఇంతలా బీజేపీ మీద విరుచుకుపడుతూ మాట్లాడే నేత అయితే వర్తమానంలో ఏపీలో లేరు. దాంతో బీజేపీని కోరి మరీ బదనాం చేస్తున్నారు అంటే ఈసారి ఎవరూ ఆ పార్టీతో పొత్తులకు సిద్ధం కాకపోవచ్చు అని అంటున్నారు.
అసలు అలా జరగాలనే షర్మిల చేత కాంగ్రెస్ పెద్దలు బీజేపీ వ్యతిరేక విమర్శలు చేస్తున్నారు అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా కూడా బీజేపీని దూరం పెట్టడం అన్నది షర్మిల ప్రసంగాలలో ముఖ్యమైన అంశంగా ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి అది అవసరం కూడా.
బీజేపీని దూరం పెడితే టీడీపీతో పొత్తులకు కాంగ్రెస్ రెడీ అవుతుంది. అపుడు కాంగ్రెస్ కి ఎంపీలు కూడా కొందరు ఏపీ నుంచి ఉంటారని అంచనా వేస్తున్నారు. అలాగే చంద్రబాబు ఇండియా కూటమిలోకి వస్తే అది ఆ పార్టీకి జాతీయ స్థాయిలో బలంగా మారుతుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే షర్మిల నియామకం వెనక చాలా సమీకరణలు ఉన్నాయని అంటున్నారు.