జోరు పెంచిన షర్మిల... టార్గెట్ జగన్ - బీజేపీ!
షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన తర్వాత నేతల్లోనూ, కేడర్ లోనూ కొత్త ఉత్సాహం వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Jan 2024 10:55 AM GMTషర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన తర్వాత నేతల్లోనూ, కేడర్ లోనూ కొత్త ఉత్సాహం వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కామెంట్లకు బలం చేకూరుస్తూ.. ఆ ఉత్సాహం చల్లబడిపోకుండా అన్నట్లుగా షర్మిల దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మధ్యలో ఒక్క రోజు రెస్ట్ తీసుకుని.. రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తొలిరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్తగా బాధ్యతలు తీసుకున్న షర్మిల జోరు పెంచారు. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపడంతో పాటు తిరిగి కాంగ్రెస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా... నేటి నుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. తొమ్మిది రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించరు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పైనా, నరేంద్ర మోడీపైనా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.
ఈ సందర్భంగా మైకందుకున్న షర్మిళ.. ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్థావించారు! ఇందులో భాగంగా ఒకటి తాను వైఎస్సార్ వారసులాని అని, రెండోది.. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ ఫ్యామిలీని ఇబ్బందులకు గురిచేయలేదని, మూడోది.. బీజేపీ మతతత్వ పార్టీ అని కాగా.. నాల్గవది వైఎస్ జగన్ బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకురాలేదని! ప్రధానంగా రాజకీయంగా ఈ నాలుగు అంశాలనే షర్మిల ప్రాస్థావించారు!!
ఈ సమయంలో... వైఎస్సార్ పాదయాత్ర ఇచ్ఛాపురంలోనే ముగిసిందని గుర్తుచేసిన షర్మిల... ప్రజల కష్టాలను చూసి ఒక్క అవకాశం అడిగిన ఆయన, ముఖ్యమంత్రి అయ్యాక 46 లక్షల మందికి పక్కా ఇళ్లు కట్టించారని అన్నారు. ఇదే సమయంలో... ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఇదే ఇచ్ఛాపురం నుంచి తన ప్రస్థానం కూడా మొదలైందని చెప్పుకొచ్చారు. ఈ ప్రస్థానాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు.
ఇదే సమయంలో... వైఎస్సార్ కి కాంగ్రెస్ పార్టీ ఎంత బలమో.. ఆయనకీ కాంగ్రెస్ పార్టీ అంతే బలమని చెపిన షర్మిల... రాజశేఖర్ రెడ్డిని అవమానించిన పార్టీ అని కొందరు చేస్తున్న విమర్శల్లో నిజాలు లేవని తెలిపారు. వైఎస్సార్ అంటే ఇప్పటికీ పార్టీ అధిష్ఠానానికి అభిమానం ఉందని.. ఆ విషయాన్ని స్వయంగా సోనియా గాంధీయే తనకు చెప్పారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా... వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందనటంలో వాస్తవం లేదని షర్మిల చెప్పడం గమనార్హం.
ఇక.. నేడు ఏపీలో బీజేపీ రాజ్యమేలుతోందని, ఏపీలో ప్రజలు ఆ పార్టీని తృణీకరించినా.. నాయకులు మాత్రం బానిసలుగా మారిపోయారని ఆమె విమర్శించారు. ఇదే సమయంలో... బీజేపీ మతతత్వ పార్టీ అని, అలాంటి మతతత్వ పార్టీకి ఏపీ నేతలు ఊడిగం చేస్తున్నారంటూ షర్మిళ ఫైరయ్యారు!
అనంతరం జగన్ పై ఫైరయిన షర్మిల... 10 ఏండ్లు గడుస్తున్నా ప్రత్యేక హోదా అడగటం లేదని.. ఒక్క రోజు కూడా జగన్ ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించిన పాపాన పోలేదని.. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అనే మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా... రాహుల్ గాంధీ మొదటి సంతకం ప్రత్యేకహోదాపైనే పెడతానని చెప్పారని షర్మిల చెప్పుకొచ్చారు!