Begin typing your search above and press return to search.

షర్మిలపై నేతల గుస్సా వెనుక అసలు కారణం ఇదేనా?

ఎన్నికల్లో సమర్థులకు టికెట్లు ఇవ్వకుండా.. డబ్బులు ఇచ్చినవారికి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.

By:  Tupaki Desk   |   18 July 2024 8:30 AM GMT
షర్మిలపై నేతల గుస్సా వెనుక అసలు కారణం ఇదేనా?
X

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యవహార శైలిపై సీనియర్‌ నేతలు అసంతృప్తి ఉన్నారా అంటే అవుననే అంటున్నారు. ఆమె పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎన్నికలు పూర్తయ్యాక ఏపీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు సుంకర పద్మశ్రీ, రాకేశ్‌ రెడ్డి.. షర్మిల, ఏపీ పీసీసీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌ లపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. వీరిద్దరూ డబ్బులు తీసుకుని తమకు నచ్చినవారికి సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తద్వారా పార్టీ ప్రతిష్టకు, నాయకత్వానికి తీరని ద్రోహం చేశారని విమర్శించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి వైఎస్‌ షర్మిల ఒంటెద్దు పోకడలే కారణమని పద్మశ్రీ, రాకేశ్‌ రెడ్డి బహిరంగంగానే తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె సొంత నిర్ణయాల కారణంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో సమర్థులకు టికెట్లు ఇవ్వకుండా.. డబ్బులు ఇచ్చినవారికి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.

అలాగే ఎన్నికల సందర్భంగా తెలంగాణ, కర్ణాటకల నుంచి ఏపీకి పార్టీ తరఫున నిధులు అందాయని.. అయితే వాటి లెక్కల విషయం షర్మిల చెప్పడం లేదని మరికొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండటంతో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నిధులు అందజేసిందని.. అయితే వీటిని ఎలా ఖర్చు చేశారు, ఇంకా ఎంత మిగిలాయనే అనే లెక్కలు షర్మిల చెప్పడం లేదని కొందరి నేతల ఆరోపణగా ఉందని అంటున్నారు.

పార్టీలో ఉన్న సీనియర్‌ నేతలు సైతం షర్మిల వ్యవహార శైలిపై గుస్సాగా ఉన్నారని తెలుస్తోంది. వీరిలో కొందరు పార్టీ మారిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో సీట్లు దక్కని వైసీపీ నేతలను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకుని షర్మిల వారికి సీట్లు ఇచ్చారు.

అలాగే పాతతరం కాంగ్రెస్‌ నాయకులు, మాజీ మంత్రులు చింతామోహన్, జేడీ శీలం, పల్లంరాజు, రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్‌ వంటివారు పార్టీలో కొనసాగుతున్నారు. వీరిలో కొంతమంది కూడా షర్మిల పనితీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు తనపైన తీవ్ర ఆరోపణలను చేసిన ఏపీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు.. సుంకర పద్మశ్రీ, రాకేష్‌ రెడ్డిలను తాను పట్టించుకోబోనని వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. వీరి సంగతి అధిష్టానమే చూసుకుంటుందన్నారు. ఈ మేరకు ఏపీ పీసీసీ క్రమశిక్షణా సంఘం వీరు బహిరంగంగా చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని షోకాజు నోటీసులు జారీ చేసింది. అయితే తమకు షోకాజు నోటీసులు జారీ చేసి తొలగించే అధికారం ఏపీ పీసీసీకి లేదని పద్మశ్రీ, రాకేశ్‌ రెడ్డి చెబుతున్నారు. ఏఐసీసీకి మాత్రమే తమను తొలగించే అధికారం ఉందని స్పష్టం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏఐసీసీ వెబ్‌ సైటులో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఉన్న సుంకర పద్మశ్రీ, రాకేశ్‌ రెడ్డి, జంగా గౌతమ్, షేక్‌ మస్తాన్‌ వలి పేర్లు, ఫొటోలు ఇప్పుడు కనిపించడం లేదు. రాహుల్‌ గాంధీకి షర్మిల ఫిర్యాదుల నేపథ్యంలోనే ఇలా జరిగిందని టాక్‌ నడుస్తోంది. మరోవైపు పార్టీకి సంస్థాగత ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో ఎన్నికలు పూర్తయి కొత్తవారు వచ్చేవరకు వీరిని తొలగించారని ఒక ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీ వెబ్‌ సైట్‌ లో ప్రస్తుతం పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల పేరు మాత్రమే కొనసాగుతోంది.