వైఎస్ షర్మిల ధైర్యం అదేనా?
వైఎస్ షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 5 Jan 2024 6:59 AM GMTవైఎస్ షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో షర్మిల చేరిన నేపథ్యంలో ఆమెకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీలో పదవి ఇస్తారా? ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా? అనేదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.
కాగా కాంగ్రెస్‌లో చేరిన షర్మిలకు ఆంధ్ర పీసీసీ పగ్గాలు అప్పగించేందుకే రాహుల్ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో.. ఆయన, మల్లికార్జునఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారని చెబుతున్నారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు తప్ప ఆమె రాకను అందరూ స్వాగతించారని టాక్.
ఈ నేపథ్యంలో పీసీసీ పగ్గాలు దాదాపు ఖాయమవ్వడంతో షర్మిల ఏపీలో క్రిస్టియన్లపై గురిపెట్టారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 20 శాతం వరకు క్రిస్టియన్లు ఉన్నారని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ లో 2 వేల చర్చిలను కూల్చివేశారని, ఎంతోమంది క్రిస్టియన్లపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా ఒక క్రిస్టియనేనని.. అందువల్ల బాధపడుతున్నానని తెలిపారు. తద్వారా వారి మనసు చూరగొనే ప్రయత్నం చేశారు.
మరోవైపు షర్మిల భర్త అనిల్ కుమార్ క్రైస్తవ మత బోధకుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో ఆయనది కూడా కీలక పాత్రే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడం, క్రిస్టియన్లను వైసీపీకి ఓటేసేలా ప్రభావితం చేయడం వంటి బాధ్యతలను అనిల్ చూసుకున్నారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఆయన తన భార్య వైఎస్ షర్మిలకు అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా క్రిస్టియన్లను మలుపు తిప్పే అవకాశం ఉందని అంటున్నారు.
వాస్తవానికి ఎస్సీ, ఎస్టీలు, ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ కు మొదటి నుంచి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. వైసీపీ ఏర్పాటు, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో దెబ్బతినడంతో ఈ వర్గాల్లో అత్యధిక భాగం వైసీపీ వెంట నిలిచాయి.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడితే నష్టపోయేది వైసీపీయేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే షర్మిల, తదితర నేతల చేరికలతో కాంగ్రెస్ బలపడితే ముస్లిం, ఎస్సీ, ఎస్టీలు, క్రిస్టియన్లలో చీలిక తప్పదు. కాంగ్రెస్ పార్టీతోనూ ఆయా వర్గాల్లో కొంతమంది నడవడం ఖాయమంటున్నారు. ఇదే జరిగితే వైసీపీకి నష్టం జరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు ఇస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్లు, ముస్లిం వర్గాలపైనే ఫోకస్ చేస్తారని అంటున్నారు.