Begin typing your search above and press return to search.

కనిపించే పార్టీల మధ్య కంటికి కనిపించని పొత్తు... షర్మిల దూకుడు!

ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం షర్మిల ప్రదర్శిస్తున్న దూకుడు, చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 Jan 2024 10:57 AM GMT
కనిపించే పార్టీల మధ్య కంటికి కనిపించని పొత్తు... షర్మిల దూకుడు!
X

ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం షర్మిల ప్రదర్శిస్తున్న దూకుడు, చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆమె చేస్తున్న విమర్శలు సంచలనంగా మారుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబుని కూడా షర్మిల విమర్శిస్తున్నారు. ఈ సమయంలో మరోసారి జగన్, బీజేపీ లక్ష్యంగా షర్మిల ఫైరయ్యారు. దీంతో... తాజా కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి.

అవును... పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ షర్మిల దూకుడు ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆమె చేస్తున్న విమర్శలు... చంద్రబాబుని తమలపాకుతో కొడుతున్నట్లు, జగన్ ని తలుపుచెక్కతో కొడుతున్నట్లు ఉన్నాయనే కామెంట్లను సొంతం చేసుకుంటున్నాయని అంటున్నారు! ఆ సంగతి అలా ఉంటే... ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న షర్మిల... రెండో రోజు బుధవారం విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన కొనసాగిస్తున్నారు.

జిల్లల పర్యటనలో భాగంగా తొలిరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో మొదలుపెట్టిన షర్మిల... అదే ఫైర్ ని రెండో రోజు కూడా కంటిన్యూ చేశారు. ఇందులో భాగంగా... విశాఖపట్టణం జిల్లా స్థానిక కాంగ్రెస్ నేతలతో షర్మిల సమావేశం అయ్యారు. అనంతరం మైకందుకున్న ఆమె... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని.. పాలకపక్షం, ప్రతిపక్షం బీజేపీతో ములాఖత్ అయ్యారని షర్మిల విమర్శించారు.

ఈ సందర్భంగా చంద్రబాబువి కనిపించే పొత్తులు అని, సీఎం జగన్‌ వి కనిపించని పొత్తులు అని ఆమె విరుచుకుపడ్డారు! ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకోసం గట్టిగా మాట్లాడిన జగన్... అధికారంలోకి వచ్చాక ఒక్క మాటకూడా ఎందుకు మాట్లాడం లేదని ఈ సందర్భంగా షర్మిల ప్రశ్నించారు. ఇక వైజాక్ కి వైసీపీ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని నిలదీశారు! కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు.

రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్నా... విశాఖ రైల్వే జోన్, పోలవరంలో 90శాతం, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని షర్మిల విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వేస్తున్న అడుగులకు వైసీపీ ప్రభుత్వం వత్తాసు పలికిందంటూ షర్మిల విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో... విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా తూట్లు పొడుస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఏపీలో మళ్లీ అభివృద్ధి జరగాలంటే.. రాష్ట్రం అభివృద్ధి బాటలో పయణించాలంటే.. కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రావాలని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలిసంతకం ప్రత్యేక హోదామీద పెడతామనే విషయం రాహుల్ గాంధీ తెలిపారని చెప్పుకొచ్చారు. ఇలా మైకందుకున్న ప్రతీచోటా... ఏపీ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు!