అక్కడ ఇండియా కూటమికి బీటలు...ఏపీలో కాంగ్రెస్ తో షర్మిల ఎదురీత...!
వైఎస్ షర్మిల రాజకీయ ఆకాంక్షను ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆమె రాంగ్ టైమింగ్ కి మాత్రం ఒక విధంగా బాధపడాల్సిందే అని అంటున్నారు
By: Tupaki Desk | 28 Jan 2024 3:34 AM GMTవైఎస్ షర్మిల రాజకీయ ఆకాంక్షను ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆమె రాంగ్ టైమింగ్ కి మాత్రం ఒక విధంగా బాధపడాల్సిందే అని అంటున్నారు. తెలంగాణాలో ఆమె పార్టీ పెట్టడమే ఒక రాంగ్ అని అంతా అంటున్న నేపధ్యం ఉంది. అది రుజువు కూడా అయింది. తాను ఎంతలా ఆడ పిల్లను తెలంగాణా కోడలు అని షర్మిల చెప్పినా కూడా ఆమె పార్టీ సరిగ్గా రెండున్నరేళ్లలోనే చాప చుట్టేయాల్సి వచ్చింది.
అది కూడా ఆమె ఎక్కడా పోటీ చేయకుండానే జెండా ఎత్తేయడం పొలిటికల్ ట్రాజడీ గానే చూస్తున్నారు. దేశంలో ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. సరే తెలంగాణాలో పార్టీ ఎందుకు పెట్టినా అక్కడే ఉంటూ 2028 నాటికి అయినా తన రాజకీయ జాతకాన్ని మార్చుకునే ప్రయత్నం షర్మిల చేసి ఉంటే బాగుండేది. కానీ చాలా ఆత్రంగా ఆమె కాంగ్రెస్ లో పార్టీని కలిపేసి వెంటనే ఏపీకి షిఫ్ట్ అయ్యారు.
ఇక్కడ చూస్తే సొంత అన్న మీద రాజకీయ యుద్ధం ప్రకటించారు. ఇక షర్మిల కాంగ్రెస్ లో చేరే సమయం చూస్తే కర్నాటక, తెలంగాణా రాష్ట్రాలు రెండూ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి కానీ మరో వైపు చేతిలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ కాంగ్రెస్ పోగొట్టుకుంది. మధ్యప్రదేశ్ వంటి పెద్ద స్టేట్ లో కూడా గెలుపు పిలుపు వినిపించలేదు.
ఇలా కాంగ్రెస్ కి కొంత డౌన్ ఫాల్ స్టార్ట్ అయిన టైం లో షర్మిల ఏపీకి పీసీసీ చీఫ్ గా వచ్చారు. ఇపుడు చూస్తే ఇండియా కూటమి కూడా మెల్లగా బీటలు వారుతోంది. మొన్న మమతా బెనర్జీ, నిన్న ఆప్ కేజ్రీవాల్, నేడు బీహార్ నితీష్ కుమారు. ఆ వెంటనే యూపీలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ షాక్ ఇచ్చేస్తూ ఇండియా కూటమి నుంచి తప్పుకుంటున్నారు. ఇక ఇండియా కూటమిలో మిగిలింది ఎవరూ అంటే తమిళనాడు డీఎంకే స్టాలిన్, అలాగే బీహార్ లో లాలూ యాదవ్ మాత్రమే.
మరో వైపు రామందిరం ప్రారంభం, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట తరువాత బీజేపీకి పాజిటివ్ వేవ్ దేశమంతా వీస్తోంది. అది ఎలాంటిది అంటే కార్గిల్ యుద్ధం తరువాత వాజ్ పేయ్ కి వచ్చిన వేవ్ అని అంటున్నారు. ఆ టైం లో ఏపీలో షర్మిల పాతాళానికి దిగజారిన కాంగ్రెస్ ని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. అదే టైం లో బీజేపీని విమర్శిస్తూ పోతున్నారు.
ఇక కాంగ్రెస్ లో ఎవరు చేరుతారు అన్న చర్చ కూడా ఉంది. ఓల్డ్ లీడర్స్ తప్పుకోగా మిగిలిన వారే వెనక ఉన్నారు. కొత్త వారు రారు. ఇక కాంగ్రెస్ లో చేరితే కనీసం ఎన్నికల ఖర్చుని అయినా ఆ పార్టీ భరిస్తుంది అన్నది నిన్నటి దాకా ఆశ, నేడు అదీ లేదు, ఇండియా కూటమి బీటలు వారి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పవర్ లోకి రాదు అని తేలుతున్న నేపధ్యం. కాంగ్రెస్ చేతిలో ఉన్నవి మూడే రాష్ట్రాలు. దాంతో ఆ పార్టీలో చేరి పోటీ చేస్తే ఖర్చులు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది.
అదే బీజేపీలో చేరితే కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ అన్నీ చూసుకుంటుంది. ఆ గిరాకీ ఉండబట్టే కాషాయం వైపు పొత్తుల కోసం కూడా అంతా చూస్తున్నారు. ఏది ఏమైనా షర్మిల ఏపీలో రాజకీయంగా ఇబ్బందులు పడేలాగే కాంగ్రెస్ పరిస్థితులు కూడా జాతీయంగా ఉన్నాయని అంటున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలిచిన నాటికి తెలంగాణాలో గెలిచిన నాటికి ఈ రోజుకీ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో తగ్గిపోయింది అన్నది ఒక మాట. సో షర్మిల ఆయాసపడుతూ ఏపీలో ఎంత తిరిగినా గెలుపు పిలుపు వినిపిస్తుందా అన్నది కూడా ప్రశ్నగా ఉంది అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.