Begin typing your search above and press return to search.

ఆ విషయాన్ని తలుచుకుని ఏడ్చేసిన షర్మిల!

అలాగే తన తండ్రి వైఎస్సార్‌ స్నేహితులను కలిసి వారి ఆశీస్సులు పొందుతున్నారు.

By:  Tupaki Desk   |   7 March 2024 11:17 AM GMT
ఆ విషయాన్ని తలుచుకుని ఏడ్చేసిన షర్మిల!
X

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవాలని గట్టిగానే కష్టపడుతున్నారు. ఇప్పటికే సీనియర్‌ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అలాగే తన తండ్రి వైఎస్సార్‌ స్నేహితులను కలిసి వారి ఆశీస్సులు పొందుతున్నారు. కాంగ్రెస్‌ లో చేరాలని కోరుతున్నారు.

ఇంకోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ కి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులతో షర్మిల కొద్దిరోజులపాటు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల నుంచి ఆమె దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ క్రమంలో 175 అసెంబ్లీ, 25 లోక్‌ సభ స్థానాలకు బాగానే అభ్యర్థులు దరఖాస్తు చేశారు.

కాగా కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవాలని ఆశిస్తున్న వైఎస్‌ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. బహిరంగ సభలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశాన్ని తరచూ ఆమె లేవనెత్తుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై తిరుపతిలో బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఇటీవల అనంతపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చారు. ఇంకా సీనియర్‌ నేతలెందరో పాల్గొన్నారు.

రాహుల్‌ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తామని వైఎస్‌ షర్మిల చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.

తాజాగా మంగళగిరిలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ వైఎస్‌ షర్మిల కంటతడి పెట్టుకున్నారు. పోరాడకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదన్నారు. ఈ క్రమంలో ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదని షర్మిల తెలిపారు. ఈ విషయంలో తల్లి లాంటి ఏపీని జగన్‌ వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ నిరాహార దీక్షలు చేశారని.. మూకుమ్మడి రాజీనామాలు చేద్దామన్నారని గుర్తు చేశారు. మరి జగన్‌ సీఎం అయ్యాక ఆ పార్టీ నుంచి ఒక్కరైనా రాజీనామా చేశారా? అని నిలదీశారు. ఒక్కటైనా నిజమైన పోరాటం చేశారా? అని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా మన బిడ్దల హక్కు అని షర్మిల తెలిపారు. దీన్ని ఎంతమంది పట్టించుకున్నారు? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాజధాని, పోలవరం మనం కట్టుకోలేమా? అని ప్రశ్నించారు. మన రాష్ట్రం ఎందుకు తక్కువగా ఉండాలన్నారు. ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్‌ గాంధీ అని కొనియాడారు. ఆయన మాటతోనే తాను ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టానని షర్మిల తెలిపారు.

ఇన్నాళ్లూ తాను వ్యక్తిగత కారణాల వల్లే తాను ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు అలా అనుకుంటే 2019లోనే ఇక్కడ అడుగు పెట్టేదాన్ని అని వెల్లడించారు.