'ఆమె'పై అచ్చెన్నకు కోపమొచ్చిన వేళ!
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సాగిస్తున్నారు.
By: Tupaki Desk | 9 Aug 2024 8:18 AM GMTకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా రెండు నెలలయినా కాకముందే అప్పుడే ప్రతిపక్షాలు వైసీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు విమర్శలు సాగిస్తున్నాయి. ఎన్నికల ముందు టీడీపీ, జనసేన పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సాగిస్తున్నారు. సాగర్ కుడికాలువ ఆయకట్టు కింద సాగునీరు వచ్చిందని సంతోషపడే లోపే వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం 4 లక్షల మంది రైతుల పాలిట శాపంలా మారిందని ఆమె మండిపడ్డారు. డిమాండ్ ఉన్న విత్తనాలను అందుబాటులో ఉంచడంలో కూటమి సర్కార్ విఫలమయ్యిందన్నారు. రైతుల ఆశలను పూర్తిగా ఆవిరి చేస్తున్నారని విమర్శించారు.
క్రాప్ హాలిడే నుంచి బీడు భూములను సాగులోకి తెద్దామనే రైతు ఆశను మళ్లీ చంపుతున్నారని షర్మిల మండిపడ్డారు. పోలీసులను కాపలా పెట్టి టోకెన్లు ఇవ్వడం ఏంటని నిలదీశారు. పదో పరకో ఇచ్చి కౌంటర్లు మూయడం ఏంటని ప్రశ్నించారు. రైతులు అడిగింది కాకుండా సర్కారుకు నచ్చిన విత్తన రకం కొనాలని ఒత్తిడి చేయడం ఏంటి అని నిలదీశారు.
మహిళలు అని చూడకుండా విత్తనాల కోసం వర్షంలో నిలబెడతారా అని షర్మిల ప్రశ్నించారు. తొక్కిసలాట జరుగుతుంటే చోద్యం చూస్తారా అని ప్రశ్నలు సంధించారు. రైతు పక్షపాతి అని చెప్పుకొనే కూటమి సర్కారుకి ఇది తగునా అని నిలదీశారు.
10రోజులుగా కాళ్లు అరిగేలా రైతులు విత్తన కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే కనపడటం లేదా అని షర్మిల ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వెంటనే 48 గంటల్లో జేజీఎల్– 384 రకం విత్తనాలను 15 వేల క్వింటాళ్లు రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ విత్తనాన్ని సైతం రాయితీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని కోరారు.
ఈ మేరకు వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తన పోస్టును ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ఆమె ట్యాగ్ చేశారు.
ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇది మీ అన్న (జగన్) పాలన కాదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా విత్తనాల కొరత లేదన్నారు. రైతుల ప్రయోజనం కోసం ఎటువంటి చర్యలకైనా ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా అడుగులు పడుతున్న రాష్ట్రంలో రైతులను అనవసర భయాలకు గురి చేయకండి అని షర్మిలకు హితవు పలికారు.
రాష్ట్రంలో ఖరీఫ్ లో ఇప్పటికే 5.1 లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందించామన్నారు. ఇంకా విత్తన పంపిణీ కొనసాగుతోందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
పల్నాడు జిల్లాకు తెలంగాణా నుంచి ఒక ప్రైవేటు వ్యాపారి తెచ్చి విక్రయిస్తున్న ఒక రకం విత్తనం కోసం కొందరు రైతులు పోటీ పడ్డారన్నారు. జేజీఎల్ – 384 రకం కంటే మేలైన రకం విత్తనాలను దాదాపు 15 వేల క్వింటాళ్లు సిద్ధంగా ఉంచామని అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు ఈ అంశంపై అవగాహన కూడా కల్పించామన్నారు.
అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో 80% రాయితీపై విత్తనాలు అందించిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు.. షర్మిల పోస్టుకు కౌంటర్ ఇచ్చారు. తన పోస్టును వైఎస్ జగన్, వైఎస్ షర్మిల, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, చంద్రబాబులకు ట్యాగ్ చేశారు.