వైఎస్సార్ అంటేనే డేరింగ్ వారసులు పిరికివారా ?
అలాంటి వైఎస్సార్ వారసులు ఎలా ఉండాలి అంటే తండ్రి లక్షణాలను పుణికి పుచ్చుకున్నట్లుగానే అని అంటారు
By: Tupaki Desk | 29 July 2024 3:45 AM GMTవైఎస్సార్ అన్న పదంలోనే రీసౌండ్ ఉంది. పాజిటివ్ వేబ్రేషన్స్ ఉన్నాయి. ఆయన పొలిటికల్ గా బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నాయకుడు. స్వాతంత్ర్యం వచ్చాక తెలుగు రాష్ట్రాలను ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలిస్తే అందులో తమకంటూ కొన్ని పేజీలను దాచుకున్న వారిలో వైఎస్సార్ కూడా ఒకరు.
ఆయన డేరింగ్ అండ్ డేషింగ్ అని చెప్పాలి. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే మొక్కవోని ధైర్యంతో ముందుకే సాగారు. అలాంటి వైఎస్సార్ వారసులు ఎలా ఉండాలి అంటే తండ్రి లక్షణాలను పుణికి పుచ్చుకున్నట్లుగానే అని అంటారు. అయితే వైఎస్సార్ వారసుడిగా తొలుత రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్ డేరింగ్ గానే వెళ్తూ వచ్చారు.
అయితే ఆయన సీఎం అయిన తరువాతనే ధోరణి మారింది. జనంతో కనెక్షన్ తగ్గింది. పరదాల మాటున సభలు జరిగాయి. అలా ఆనాడు ఆయన్ని టీడీపీ జనసేన పార్టీలు విమర్శించాయి. ఆయనకు జనంలోకి రావడం అంటే భయం అన్నాయి. ఇపుడు ఆయన విపక్షంలోకి వచ్చారు. ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి వెళ్ళడంలేదు.
దాంతో టీడీపీ కూటమి పెద్దలు జగన్ ని భయంతోనే అసెంబ్లీకి రావడం లేదు అని ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక జగన్ సొంత చెల్లెలు ఏపీ పీసీసీ చీఫ్ అయిన షర్మిల అయితే జగన్ ని పట్టుకుని పిరికి వారని ట్వీట్లు వేయడంతో రాజకీయ రచ్చ రేగింది.
ప్రతిపక్ష హోదా ఉంటేనే తప్ప అసెంబ్లీలోకి అడుగు పెట్టరా అది పిరికితనం తప్ప మరోటి కాదని ఆమె తేల్చేశారు. జగన్ ది అహంకారపూరితమైన వైఖరి అని ఆయనది చేతకాని రాజకీయం అని కూడా ఆమె నిప్పులు చెరిగారు
దానికి బదులిస్తూ వైసీపీ కౌంటర్లు వేసింది. తెలంగాణాలో పార్టీ పెట్టి అక్కడ నడపలేక ఏపీకి వచ్చిన షర్మిల కంటే పిరికి రాజకీయ నాయకురాలు ఎవరు ఉంటారు అని ఎద్దేవా చేసింది. షర్మిలది నిలకడ లేని రాజకీయమని కూడా ఘాటు విమర్శలే చేసింది. సాటి ప్రతిపక్ష పార్టీని విమర్శించడం ఏమి ఔచిత్యమో తెలియని విధంగా చేతగాని రాజకీయం ఆమె చేస్తున్నారు అని రివర్స్ అటాక్ చేసింది.
ఇవన్నీ పక్కన పెడితే ఈ ఇద్దరూ వైఎస్సార్ వారసులు. ముందే చెప్పుకున్నట్లుగా వైఎస్సార్ అంటేనే డేరింగ్ అండ్ డేషింగ్. మరి అలాంటి ఆయన కడుపున పుట్టిన అన్నాచెల్లెలు నీవు పిరికి అంటే నీవు పిరికి అనుకోవడం ఆయన అభిమానులకు ఏ మాత్రం నచ్చడం లేదు. రాజకీయ విమర్శలు దాటి వ్యక్తిగత విమర్శలుగా మారడంతో పెద్దాయన దివంగత నేత వైఎస్సార్ ఇమేజ్ కే అది ఇబ్బందిగా మారుతుందని ఎందుకు గుర్తించడం లేదని అంటున్న వారూ ఉన్నారు.
రాజకీయాల్లో ఎవరైనా తగ్గి ఉండడం తప్పు కాదు. అది పిరికితనం కిందకు రానే రాదు. షర్మిల ఏపీకి షిఫ్ట్ కావాలనుకోవడం రాజకీయంగా తీసుకున్న ఒక నిర్ణయం. జగన్ అసెంబ్లీకి దూరంగా ఉండాలనుకోవడం కూడా ఒక వ్యూహం కావచ్చు. కానీ అన్నా చెల్లెలూ వీధిన పడడం వల్ల ఇతర పార్టీలు ఏమీ అనవలసిన అవసరం లేకుండా విమర్శలు చేసుకుంటున్నారు అన్నదే వైఎస్సార్ అసలైన అభిమానుల బాధగా ఉంది.