షర్మిల ఎఫెక్ట్.. వైసీపీకి ప్లస్-టీడీపీకి మైనస్.. నిజమేనా..!
దీనిపై రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు కూడా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మాకు నష్టం లేదు.. వైసీపీకే నష్టమని టీడీపీ నేతలు చెబుతున్నారు.
By: Tupaki Desk | 18 Jan 2024 1:30 PM GMTఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ తనయ.. వైఎస్ షర్మిల రేపో మాపో ఏపీలోకి అడుగు పెట్టనున్నారు. అయితే.. ఆమె రాకతో.. ఎవరిపై ప్రభావం పడుతుంది? ఏ పార్టికి నష్టం చేకూరుతుంది? అనేది ఆసక్తిగా మారింది. దీనిపై రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు కూడా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మాకు నష్టం లేదు.. వైసీపీకే నష్టమని టీడీపీ నేతలు చెబుతున్నారు. అస్సలు ఆ మాటే అవసరం లేదు.. నష్టపోయేది టీడీపీనే అని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
మొత్తంగా షర్మిల రాకేమో.. కానీ.. వైసీపీ, టీడీపీ ప్రచారం మాత్రం జోరెత్తుతోంది. ఇక, వాస్తవంలోకి వెళ్తే.. వ్యక్తులు, ఓటు బ్యాంకు పరంగా వైసీపీ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్‌లో ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకులు అంతా కూడా.. వైసీపీలో ఉన్నారు. వీరిలో చాలా మంది టికెట్ కోసం వేచి ఉండి.. ప్రయోజనం లేక మారు మాటకుండా మౌనం వహిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వారంతా.. వైసీపీకి దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది.
వీరిలో కొందరికి టీడీపీ అంటే గిట్టకపోవచ్చు. దాంతో షర్మిల వెనుక నడిచే అవకాశం ఉంది. ఇలాంటి వారి వల్ల వైసీపీకి కొంత నాయకుల నష్టం జరిగితే జరగొచ్చు. ఇక, ఓటు బ్యాంకు పరంగా.. షర్మిల కనుక ప్రజలను నమ్మించి.. వైఎస్ ఇమేజ్‌ను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తే.. అప్పుడు ఓటు బ్యాంకు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. సో.. ఇది కూడా వైసీపీకి కొంత మేరకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది.
ఇక, టీడీపీ విషయానికి వస్తే.. నాయకుల పరంగా ఎలాంటి నష్టం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే.. సంస్థాగతంగా పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు ఈ పార్టీతోనే ఉంటారు. మధ్యలో వచ్చిన వారు వెళ్లిపోయినా.. పార్టీకి జరిగే నష్టం ఏమీ ఉండదు. ఇది కామనే. అయితే.. ప్రధాన నష్టం ఏంటంటే.. ఓట్లు చీలికే! ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా.. చూసుకునేందుకు ఇన్నాళ్లుగా ప్రయత్నాలు చేసిన.. టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ రాకతో.. వైసీపీ వ్యతిరేక ఓటు కనుక కాంగ్రెస్‌కు పడితే.. అప్పుడు టీడీపీ కొంత ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మొత్తగా రెండు పార్టీలపైనా ప్రభావం పడుతుందన్నమాట. అయితే.. ఒకదానిపై ఒకరకంగా మరోదానిపై మరోరకంగా ఈ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది.