షర్మిళ నమ్మకం... వివేకా కేసుపై తాజా వ్యాఖ్యలు వైరల్!
కేసు సీబీఐ చేతుల్లో ఉంది.. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంది.
By: Tupaki Desk | 20 Jun 2024 7:44 AM GMTఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసు వ్యవహారం ఎంత హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ హత్య కేసు... తిరిగి టీడీపీ & కో అధికారంలోకి వచ్చే వరకూ కూడా ఛేదించబడకపోవడం గమనార్హం. కేసు సీబీఐ చేతుల్లో ఉంది.. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంది. అయితే ఏపీలో గత ఐదేళ్లు జగన్ సీఎంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ఈ కేసును తీవ్ర హాట్ టాపిక్ గా మార్చేశారు షర్మిళ. ఇందులో భాగంగా.. కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన ఏపీ పీసీసీ చీఫ్... సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అవినాష్ కు జగన్ టిక్కెట్ ఇవ్వడంపై అన్ననూ గట్టిగానే తగులుకున్నారు.
షర్మిళతో పాటు, వివేకా కుమార్తె సునీత కూడా జగన్ - అవినాష్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే... వైఎస్ వివేకానంద రెడ్డి మరణంమీదే కడప లోక్ సభ ఎన్నిక అన్నస్థాయిలో ఈ విషయం వైరల్ గా మారింది. ఒకానొక సందర్భంగా షర్మిళ, సునీతల విమర్శలు తీవ్రమవ్వడంతో కోర్టు కూడా కల్పించుకున్న పరిస్థితి.
కట్ చేస్తే... కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిళ ఓటమి పాలయ్యారు.. జగన్ కూ అధికారం పోయింది.. అవినాష్ కడప ఎంపీ అయ్యారు. ఇవన్నీ ఒకెత్తు అయితే... ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో వివేకా హత్య కేసు ఉదంతంపై వైఎస్ షర్మిళ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... ఏపీలో ప్రభుత్వం మారడం వల్ల వివేకా హత్య కేసు విచారణ వేగవంతం అవుతుందని భావిస్తున్నారా? అనే ప్రశ్నకు షర్మిళ ఆసక్తికరంగా స్పందించారు. ఏపీలో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వివేకా హత్యకేసు ఛేధిస్తుందన్న నమ్మకం బాగా పెరిగిందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇలా.. తన బాబాయి హత్య కేసు విచారణలో తన సొంత సోదరుడి ప్రభుత్వం కంటే... కూటమి ప్రభుత్వంలో త్వరితగతిన ఛేధించబడుతుందని షర్మిల చెప్పడం వైరల్ గా మారింది.